Jananayagan: లీకేజీలు ఉండొచ్చు.. ఓటీటీలు హ్యాండ్ ఇవ్వొచ్చు.. కానీ..

ABN , Publish Date - May 05 , 2026 | 11:18 AM

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు వెండితెరపై తన మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అతడు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా గళమై వినిపించబోతున్నారు.

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు వెండితెరపై తన మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అతడు, ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా గళమై వినిపించబోతున్నారు. 'తమిళగ వెట్రి కళగం' (TVK) స్థాపించినప్పుడు హేళన చేసిన వారు సైతం, ఇప్పుడు ఆయన వేగం చూసి విస్తుపోతున్నారు. అతనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఇలయ దళపతి విజయ్‌. ఆయన నటించిన చివరి చిత్రం 'జననాయగన్' ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే విధ్వంసం గురించి ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తున్నాయి.

రెండేళ్ల క్రితం టీవీకే పార్టీ పెట్టినప్పుడు.. విజయ్ (vijay) కేవలం ఓట్లు చీలుస్తారని, 20-25 సీట్లకే పరిమితం అవుతారని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. కానీ, ఫలితాలు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్..! ఏకంగా 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి, సంప్రదాయ పార్టీల కోటలను బద్దలు కొట్టారు. మ్యాజిక్ మార్క్ 118కి కేవలం అడుగు దూరంలో నిలిచిన విజయ్, ఇప్పుడు కింగ్ మేకర్‌గా ఎదిగారు. అయితే ఈ రాజకీయ ప్రస్థానంలో విజయ్ సినిమాలకు స్వస్తి పలికే క్రమంలో జననాయగన్ సినిమా విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సెన్సార్ బోర్డు నుంచి ఎదురైన చుక్కెదురులు, పదే పదే వాయిదా పడటం.. అంతటితో ఆగకుండా సినిమా హెచ్‌డీ ప్రింట్ లీక్ అవ్వడం వంటివి దళపతి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేశాయి. చివరికి అగ్రిమెంట్ చేసుకున్న ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కూడా వెనక్కి తగ్గడంతో సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విజయ్ బ్రాండ్ వాల్యూ ఎప్పుడూ తగ్గదు. సినిమా ఫ్లాప్ అయినా గోట్ లాంటి చిత్రానికే 400 కోట్లు రాబట్టిన మొనగాడు ఆయన!

లీకేజీలు ఉండొచ్చు.. ఓటీటీలు హ్యాండ్ ఇవ్వొచ్చు.. కానీ గ్రౌండ్ లెవల్‌లో ఉన్న క్రేజ్ ముందు అవేవీ నిలబడవు. ఒక నటుడిగా కాకుండా, ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా విజయ్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే.. థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. సినిమా వాయిదా పడటం ఇప్పుడు ఒక రకంగా ప్లస్ పాయింట్ అయింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సినిమా అంటే, అది కేవలం కోలీవుడ్ రికార్డులనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవబోతోంది. అభిమానులు తమ హీరో గెలవాలని కోరుకున్నారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు తమ నాయకుడికి బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జననాయగన్ సినిమా ఓపెనింగ్స్ చూస్తే బాక్సాఫీస్‌కు వణుకు పుట్టడం గ్యారెంటీ అనే టాక్‌ బలంగా వినిపిస్తుంది.

Updated Date - May 05 , 2026 | 11:33 AM