S Janaki: జానకమ్మ అంతిమయాత్రలో కనిపించిన సంస్కారం.. నెటిజన్ల ప్రశంసలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 09:43 AM
సినీ, రాజకీయ ప్రముఖులు మరణిస్తే అభిమానం పేరుతో జనాలు చేసే హంగామాను చూస్తూనే ఉన్నాం. ఇక సినిమాకు సంబంధించిన సెలబ్రిటీల మరణం అయితే అక్కడ జరిగే రచ్చ మాటల్లో చెప్పలేం.
సినీ, రాజకీయ ప్రముఖులు మరణిస్తే అభిమానం పేరుతో జనాలు చేసే హంగామాను చూస్తూనే ఉన్నాం. ఇక సినిమాకు సంబంధించిన సెలబ్రిటీల మరణం అయితే అక్కడ జరిగే రచ్చ మాటల్లో చెప్పలేం. అక్కడున్న పార్ధీవ దేహాన్ని చూసి నివాళి అర్పించే వారికంటే సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.
ఇటీవల తమిళనాడులో ఇలాంటి పరిస్థితే కనిపించింది. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మరణానంతరం ఆయన పార్థీవదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన సమయంలో అభిమానం పేరున జనాలు చేసిన హంగామా అంతాఇంతా కాదు. బౌన్సర్లు సైతం జనాలను కంట్రోల్ చేయలేకపోయారు. దీనిపై చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కాస్త సంయమనం పాటించమని నటి రాధిక చేతులు జోడించి జనాలను అర్థించారు. అయినా అక్కడున్న వారిలో ఎలాంటి విచక్షణ కనిపించలేదు. కనీసం అంబులెన్స్ నుంచి బాడీని ప్రశాంతంగా కిందకు దింపే ఆస్కారం కూడా లేకుండా చేశారు. దీనిపై చాలామంది బహిరంగంగానే పైర్ అయ్యారు. ‘మరణించినవారి కుటుంబం బాధలో ఉందనే జ్ఞానం కూడా లేకుండా నివాళి అర్పించాల్సిన ప్రాంతాన్ని సర్కస్ చేసేశారు’ అనే కామెంట్స్ వచ్చాయి.
ఇదిలా ఉండగా శనివారం రాత్రి మరణించిన దక్షిణాది గాన కోకిల ఎస్. జానకమ్మ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఆమె మనవరాలు అప్సర అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం జానకమ్మ పార్దీవ దేహాన్ని మైసూరు మహారాజా కళాశాలలో ఉంచారు. జానకమ్మను కడసారి చూసేందుకు అభిమానులు, కన్నడ ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే మైదానంలో అడుగుపెట్టిన జనాలు ఎవరూ కూడా విచక్షణారహితంగా ప్రవర్తించలేదు. ఎగబడి ఫొటోలు తీసుకోలేదు. ఓ పద్దతిలో క్యూ లైన్ పాటిస్తూ జానకమ్మను చివరి చూపు చూసి నివాళి అర్పించారు. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కన్నడ ప్రజలు ప్రాంతీయ భేదం లేకుండా మహా గాయనికి కన్నీటి వీడ్కోలునిచ్చారు. కళకు భాష, ప్రాంతాల భేదం లేదని నిరూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటక ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చూసి జనాలు ప్రశంసిస్తున్నారు. కళాకారుల పట్ల ఆ రాష్ట్రం చూపించిన గౌరవం మనసును హత్తుకుందని పోస్టులు పెడుతున్నారు. ఇది చూసి అయినా జనాల్లో మార్పు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.