జననాయగన్ రిలీజ్.. కిక్కిరిసిన థియేటర్లు! గుర్రంపై.. సినిమా రీల్స్ బాక్స్
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:50 AM
విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. అభిమానుల సంబరాలు, మంత్రుల భావోద్వేగం, త్రిష థియేటర్ సందడి, భారీ టికెట్ ధరల పూర్తి వివరాలు.
టీవీకే అధ్య క్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ (Vijay) నటించిన ఆఖరి చిత్రం జన నాయగన్ (Jana Nayagan) గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఒక్క తమిళనాడులోనే దాదాపు వెయ్యి, ప్రపంచ వ్యాప్తంగా 8 వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. తమ అభిమాన నేత చివరి సినిమాను చూసేందుకు టీవీకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు, విజయ్ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఈ సినిమా తొలి ఆట గురువారం ఉదయం 9 గంటలకు ప్రదర్శించగా, బుధవారం రాత్రి నుంచే విజయ్ ఫ్యాన్స్ సందడి చేశారు. గురువారం ఉదయం నుంచి థియేటర్ల ముందు పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు.
హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పైరసీ కాపీ గతంలో ఆన్లైన్లో విడుద లైనప్పటికీ ఈ సినిమాను చూసేందుకు విజయ్ అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు. 'గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి' అనే టైటిల్ కార్డుతో ఈ సినిమాను ప్రదర్శించడం గమనార్హం. తమిళ నాట 50 ఏళ్ల తరువాత ఒక ముఖ్యమంత్రి హీరోగా నటించిన చిత్రం ఇదే. ఎంజీఆర్ తరువాత ఆ ఘనత విజయ్ కే దక్కింది. అలాగే, సినిమాలో పలు చోట్ల చిన్న చిన్న మార్పులు చేశారు. సీఎంగా విజయం సాధించిన తర్వాత కొన్ని స్టిల్స్, ఆయన మేనరిజం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ఇందులో విజయ్ పేరు కూడా తమ పార్టీ 'టీవీకే' అనే మూడు అక్షరాలు వచ్చేలా తమిళ వెట్రి కొండా పెట్టారు. మాజీ ఐపీఎస్ జాంగిడ్, టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ కొన్ని సన్నివేశాల్లో కనిపించి ఆలరించారు.
మంత్రుల కన్నీరు..
'జన నాయగన్' చిత్రాన్ని వీక్షించేందుకు విజయ్ ఫ్యాన్స్ కంటే టీవీకే నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చూసేందుకు అమితాసక్తిని చూపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తమతమ ప్రాంతాల్లో ఉన్న థియేట ర్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు చిత్రాన్ని చూశారు. ముఖ్యంగా, సినిమాను చూసిన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కన్నీరు కార్చారు. మరీ ముఖ్యంగా తమ అభిమాన హీరోను ఇకపై వెండితెరపై చూడలేమనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్ రాజ్ కన్నీరు పెట్టుకున్నారు.
అంతేగాక.. పుదుకోట జిల్లాకు చెందిన మహమ్మద్ పర్వేజ్ తన 13 యేట నుంచే విజయ్ వీరాభిమాని. అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం విభాగ, యూనియన్ విభాగాల్లో కీలక బాధ్యత లను నిర్వహించారు. విజయ్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో గత ఎన్నికల్లో ఆయనకు ఆరంతాంగి అసెంబ్లీ సీటును కేటాయించగా, ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత తన మంత్రి వర్గంలో చోటుకల్పించారు. మంత్రి పర్వేజ్ సినిమా చూసిన తర్వాత భోరున విలపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చూసి చుట్టుపక్కలున్న వారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు.
గుర్రంపై సినిమా రీల్స్ బాక్స్..
విల్లుపురంలో ఒకే థియేటర్‌లో ఈ సినిమా విడుదకావడంతో ఈ థియేటర్‌కు అభిమానులు క్యూకట్టారు. ఈ థియేటర్‌కు కేటాయించిన రీల్స్ బాక్స్‌ను గుర్రపు బండిపై మేళతాళాలతో ఊరేగించుకుంటూ తీసుకొచ్చా రు. అలాగే థియేటర్ మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున కటౌట్లు, బ్యానర్లను కట్టారు.
త్రిష సందడి
'జన నాయగన్'ను వీక్షించేందుకు ప్రముఖ నటి త్రిష స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటరు వెళ్లారు. ఈ థియేటర్‌లో ఉదయం 9 గంటలకు సినిమా ను ప్రదర్శించగా, ఆమె జీన్స్ ఫ్యాంటు, టీషర్ట్, నల్ల కళ్ల జోడు ధరించి ఉదయం 11 గంటల సమయంలో థియే టరు వచ్చారు. త్రిషను చూడగానే అభిమానులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో థియేటర్ వద్ద భద్రతగా ఉన్న మధురవాయల్ పోలీసులు ఆమెను సురక్షితంగా థియేటర్‌లోకి తీసుకెళ్లారు.
టికెట్ రూ.2 వేలు
సినిమా టిక్కెట్లను చెన్నైలో సాధారణ రేట్లకే విక్రయించారు. కానీ, తిరుచ్చి కార్పొరేషన్ పరిధిలోని అన్ని థియేటర్లలో రూ.2 వేలకు విక్రయించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. తంజావూరు, కరూర్‌లలో రూ.1000-రూ.1500 వరకు విక్రయించారు. తంజావూరులో రూ.700-రూ.1000 వరకు విక్రయించారు.