ఇటు విడాకులు.. అటు త్రిష! రూ.35 కోట్ల.. భారీ ప్రాపర్టీ అమ్మేసిన విజయ్
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:09 AM
తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ (Thalapathy Vijay) తన ఆస్తులను విక్రయిస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ (Thalapathy Vijay) తన ఆస్తులను విక్రయిస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా చెన్నైలోని అన్నా నగర్‌లో ఉన్న సుమారు రూ.35 కోట్ల విలువైన భారీ ప్రాపర్టీని ఆయన ఇప్పటికే అమ్మేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గత ఏడాది కాలంగా ఈ ఆస్తికి సంబంధించిన బేరసారాలు జరుగుతున్నప్పటికీ, ఇటీవలే ఈ డీల్ అత్యంత వేగంగా ముగియడం వెనుక బలమైన కారణాలు ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు మరికొన్ని విలువైన ఆస్తులను కూడా విక్రయించేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ఆస్తుల విక్రయం వెనుక ప్రధానంగా రాజకీయ కారణాలు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాలు, ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం నిధుల సేకరణలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక వర్గం వాదిస్తోంది.
అయితే, మరికొందరు మాత్రం ఇది కేవలం పార్టీ అవసరాల కోసమే కాదని, తన ఆస్తులను లిక్విడేట్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా వచ్చే ఆరోపణలకు చెక్ పెట్టవచ్చని విజయ్ భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత జీవితంలో నెలకొన్న కొన్ని పరిణామాలు కూడా ఈ ఆస్తుల అమ్మకానికి కారణమై ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో ఉన్న మనస్పర్థలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన అంశాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, తమిళనాడులో ఎన్డీఏ-టీవీకే పొత్తు సినీనటి త్రిష చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక డీఎంకేదే పైచేయి అని, విపక్ష ఎన్డీఏపై 5% ఓట్ల ఆధిక్యంతో ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో విజయ్ పార్టీకి 12% ఓట్లు రావచ్చని అంచనా వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా విజయన్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్సు రాకపోవడంతో, ఆయనకు సన్నిహితురాలిగా భావిస్తున్న త్రిష ముంబైలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాతే విజయ్ సీబీఐ విచారణ నుంచి సజావుగా బయటకు రావడం, సెన్సార్ బోర్డు సినిమాను పునఃపరిశీలించేందుకు అంగీకరించడం గమనార్హం.
వచ్చే ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఏ పాత్ర పోషిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఒంటరిగానే పోరులోకి దిగుతారా లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా సర్వేల ప్రకారం విజయ్ ఈ ఎన్నికల్లో 'కింగ్ మేకర్'గా అవతరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఎన్డీఏతో పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు ఒకవైపు, త్రిష రాయబారం మరోవైపు తమిళ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆయన ఆస్తుల విక్రయం వెనుక ఉన్న అసలు కారణం వ్యక్తిగతమా లేక రాజకీయ వ్యూహమా అనేది స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలాఉంటే.. తాజాగా బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్ మాత్రం నేను సెక్యులరిస్టును అని ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని, ఒంటరిగానే ఎన్నికల్లో తలబడతానని స్పష్టం చేయడం విశేషం.