భవిష్యత్తులో.. రాజకీయాల్లోకి!
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:29 AM
కన్నడ స్టార్ హీరో యశ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై స్పందించారు.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రాజకీయాల్లోకి వస్తారనే చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని యశ్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని చెప్పారు. భవిష్యత్తులో అవసరం ఉందని అనిపిస్తే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చని తన మనసులో మాట బయటపెట్టారు.
రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన యశ్.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే రాజకీయాల అసలు ఉద్దేశంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని యశ్ తెలిపారు. తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన ఈ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారొచ్చని.. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే రాజకీయాల్లోకి రావచ్చేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యశ్.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం టాక్సిక్ ఈ నెలాకరున థియేటర్లలోకి రానుంది. సినీ కెరీర్‌లో దూసుకెళ్తున్న సమయంలో ఆయన రాజకీయాలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యశ్ నిజంగానే భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనేది చూడాలి.