Rajinikanth: ఆ ఒక్క డైలాగ్ వల్ల.. జైలర్2 చేయాల్సి వచ్చింది
ABN , Publish Date - Oct 11 , 2026 | 06:22 PM
రజనీకాంత్ ‘జైలర్ 2’ ప్రమోషన్లలో తన బస్ కండక్టర్ రోజులను గుర్తుచేసుకున్నారు. సీక్వెల్స్‌పై తన అభిప్రాయం, ‘జైలర్ 2’కు అంగీకరించడానికి కారణాన్ని వెల్లడించారు.
భారతీయ చిత్రసీమలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా ఎదిగినా తన మూలాలను ఎన్నడూ మర్చిపోనని రజనీకాంత్ (Rajinikanth) మరోసారి చాటి చెప్పారు. ‘జైలర్ 2’ (Jailer 2) ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన, సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో ఐదేళ్ల పాటు చేసిన బస్ కండక్టర్ ఉద్యోగాన్ని ఇప్పటికీ ఎంతో మిస్ అవుతున్నానని ఎమోషనల్ అయ్యారు. తాను సాధించిన విజయాలు ఎన్ని ఉన్నా తన మనసులో ఎప్పుడూ పెద్ద స్టార్‌గా ఫీలవ్వలేదని, తనలోని ఓ భాగం ఎప్పటికీ సాధారణ కండక్టర్‌గానే నిలుస్తుందని వినయంగా పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన గొప్ప వ్యక్తిత్వం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇంకా ఆయన తన తాజా సినిమా జైలర్2 గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'నాకు సీక్వెల్స్ అంటే ఇష్టం లేదు. వాటికి నేను వ్యతిరేకిని. కథాపరంగా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అన్నీ ఒక భాగంలో చెప్పేస్తాం. దానికి మరికొన్ని మసాలాలు జోడించి సీక్వెల్ తీద్దామంటే నేను అంగీకరించను. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేట' సినిమాకు సీక్వెల్ తీద్దామంటూ నా దగ్గరకు వచ్చారు. ఇందులో విజయ్ సేతుపతి పాత్రను మరింత పెంచుదామని ప్రపోజ్ చేశారు. దానికి కూడా నేను వద్దన్నా.
మరి 'జైలర్' చిత్రం సీక్వెల్‌కు ఎలా అంగీకరించారని మీరు అడగవచ్చు. ఆ సినిమా ఓటీటీలో విడుదలయ్యాక మరోసారి చూశాను. చిత్రం ముగింపులో వర్మ పాత్ర.. దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందనీ, వాళ్లు నిన్ను అంత తేలికగా వదిలి పెట్టరని అంటుంది. సో సీక్వెల్‌కు కావాల్సిన మెటీరియల్ అందులో ఉంది కనుక నేను అంగీకరించా' అన్నారు రజనీకాంత్.