సీనియర్ నటుడు రాజ్ కిర‌ణ్‌కు.. ముందస్తు బెయిల్

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:53 AM

సీనియర్ నటుడు రాజ్ కిరణ్ (Rajkiran)కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Rajkiran

సీనియర్ నటుడు రాజ్ కిరణ్ (Rajkiran)కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒక నిర్మాత అడ్వాన్స్ ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించడంలో ఏర్పడిన వివాదం కారణంగా రాజ్ కిరణ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, కోర్టు సానుకూలంగా స్పందించి మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం రాజ్ కిర‌ణ్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో 'నా అసలు పేరు ముహైదీన్ అబ్దుల్ ఖాదర్ (Mohideen Abdul Khadar). 'ఎన్ రాసావిన్ మనసిలే అనే చిత్రంలో నటించిన తర్వాత నా పేరును రాజ్ కిర‌ణ్‌గా మార్చుకున్నాను.

కొన్నేళ్ళుగా పరిశ్రమలో నటుడు, నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నాను. 2022 ఏప్రిల్ 19వ తేదీన మీంజూరులోని ఓ సినీ నిర్మాణ సంస్థ యజమాని శరవణన్ (saravanan) ఒక సినిమాలో నటించేందుకు అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే, అనివార్య కారణాలతో ఈ సినిమా ప్రారంభం కాలేదు. దీంతో నాకు ఇచ్చిన ఆడ్వాన్స్‌ను తిరిగి చెల్లించేందుకు కొంత సమయం కోరాను కానీ, శరవణన్ నిర్మాతల మండ లిలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన చర్చల తర్వాత రూ.2025 సెప్టెంబరు నెలలో రూ.10 లక్షలు చెల్లించాను. కానీ, మిగిలిన రూ.40 లక్షలను మోసం చేసినట్టుగా మీంజూరు పోలీస్ స్టేషన్‌లో శరవణన్ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో నిర్మాత శరవణన్ పొన్నేరి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశం మేరకు ఆగస్టు 28వ తేదీన నాపై కేసు నమోదైంది. 2022లో సినిమా నిర్మాణానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ నాలుగేళ్ళ తర్వాత కేసు నమోదైంది. ఇది ఒక సివిల్ కేసు. కానీ, క్రిమినల్ రంగు పులిమారు. తమిళ సినీ అభిమానులకు ఎంతో సుపరిచితమైన నేను ఎక్కడికి పారిపోనని, అందువల్ల ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పిటిషనర్ రాజ్ కిర‌ణ్‌కు ముందస్తు బెయిలు మంజూరు చేశారు.

Updated Date - Sep 27 , 2026 | 07:08 AM