Bhagyaraj: త్వరలోనే.. దర్శకత్వం! రీ ఎంట్రీలో వెబ్ సిరీస్‌, సినిమా

ABN , Publish Date - Jan 08 , 2026 | 09:41 AM

ఎంజీఆర్‌ ప్రజలకు చేసిన మంచి పనులు, ఆయన పోషించిన పాత్రలు తనలో బలమైన ముద్ర వేశాయని సీనియర్‌ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ అన్నారు.

Bhagyaraj

పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ ప్రజలకు చేసిన మంచి పనులు, ఆయన సినిమాల్లో పోషించిన పాత్రలు తన మనసులో బలమైన ముద్ర వేశాయని సీనియర్‌ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ (K. Bhagyaraj) అన్నారు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 50 యేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయనకు ఘన సన్మాన కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఐదు దశాబ్దాలుగా తనకు అండగా నిలబడి, తనకు మద్దతిస్తున్న సినీ పాత్రికేయులతో బుధవారం ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సీనియర్‌ నటులంతా నాకు గురువులే. ముఖ్యంగా ఎంజీఆర్‌ వేసిన పాత్రలు నాలో బలమైన ముద్ర వేశాయి. శివాజీ గణేశన్‌ దర్శకుడు కొత్తా, పాతా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గౌరవం ఇచ్చేవారు. చిన్న యవసులో కమల్‌ హాసన్‌ నటన చూసి ఆశ్చర్యపోయాను. నా 16 యేళ్ళ వయసులో రజనీకాంత్‌ను కలిశాను. ఆయనను తొలిసారి కలిసినపుడు ఎలా ఉండేవారో ఇపుడు కూడా అలానే ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు మీడియా మిత్రులు మద్దతిస్తూనే ఉన్నారు.

Bhagyaraj

నేను నటించిన, దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమాను ప్రేక్షకుడి కోణంలోనే రివ్యూలు ఇచ్చారు. 50 యేళ్ళ సినీ ప్రయాణం ఇప్పటికే నన్ను ఆశ్చర్య పరుస్తోంది. నా తొలి సినిమాలో హీరోగా నటించాను. రెండో సినిమాలో విలన్‌ పాత్ర పోషించాను. మూడో చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయి. చెన్నైకు వచ్చేంతవరకు సినిమా గురించి నాకు ఏమి తెలియదు. ప్రతిదీ ఇక్కడకు వచ్చి నేర్చుకున్నాను.

ప్రతి ఒక్క దర్శకుడుని చూసి అనేక విషయాలను తెలుసుకున్నారు. వారితో పాటు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌తో పాటు సినిమాకు దర్శకత్వం వహించనున్నాను. ఈ యేడాది మరికొన్ని కొత్త ప్రాజెక్టులతో మీ ముందుకు వస్తాను’ అని భాగ్యరాజ్‌ తన యేళ్ళ సినీ ప్రయాణాన్ని వివరించారు.

Updated Date - Jan 08 , 2026 | 10:08 AM