ది అన్ స్టాపబుల్ రైజ్.. 7 ఏళ్లలో 50 రెట్లు ఎదిగిన హీరో
ABN , Publish Date - Feb 25 , 2026 | 09:55 AM
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ, టాలెంట్ ఉంటే చాలు.. కాలం మన వెంటే నడుస్తుందని నిరూపించారు ప్రదీప్ రంగనాథన్.
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ, టాలెంట్ ఉంటే చాలు, కాలం మన వెంటే నడుస్తుందని నిరూపించారు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan ). కేవలం ఏడేళ్ల కాలంలో ఒక సాధారణ కుర్రాడి స్థాయి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ బడా బ్యానర్లు క్యూ కట్టే స్థాయికి ఎదిగిన వైనం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన తండ్రి నడుపుతున్న ఒక చిన్న జిరాక్స్ షాపులో పని చేస్తూనే సినిమాలపై మక్కువతో ప్రదీప్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించారు. ఆ పట్టుదలే అతన్ని 'కోమలి' (Comali) చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసింది. మొదటి సినిమాతోనే తన ముద్ర వేసిన ప్రదీప్, ఆ సినిమాకు కేవలం 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు.
దర్శకుడిగా సక్సెస్ అయ్యాక, తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. తాను తీసిన షార్ట్ ఫిల్మ్‌నే 'లవ్ టుడే' (Love Today) గా వెండితెరపై ఆవిష్కరించి, హీరోగా మారిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. హీరోగా చేసిన మొదటి సినిమాతోనే దాదాపు 70 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించారు. అక్కడితో ఈ జోరు ఆగలేదు.
ఆ తరువాత వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (Return of The Dragon) సినిమా ఏకంగా 150 కోట్ల మార్కును అందుకుంది. ప్రదీప్ మార్కెట్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'డ్యూడ్' (Dude) సినిమా సైతం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రదీప్ అంటే ఒక మినిమమ్ గ్యారెంటీ హీరో అనే ముద్ర వేసింది. ఇప్పటికీ కోలీవుడ్‌లో చాలా మంది ఫేమ్ ఉన్న హీరోలు సైతం ఇంత తక్కువ టైమ్‌లో ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేదు.
ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ప్రదీప్ ఎదుగుదల నిజంగా షాకింగ్ అని చెప్పాలి. 'కోమలి' చిత్రానికి రూ. 50 లక్షలు తీసుకున్న ఆయన, 'డ్యూడ్' సినిమా నాటికి 10 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నారు. ఇప్పుడు ఆయన క్రేజ్ చూసి బడా బ్యానర్లు ఏకంగా 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 7 ఏళ్ల క్రితం 50 లక్షలతో మొదలైన ప్రయాణం, నేడు 25 కోట్లకు చేరడం అంటే మామూలు విషయం కాదు!
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) (Love Insurance Kompany) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రదీప్‌కు జోడీగా అందాల భామ కృతి శెట్టి నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను మార్చి నెలలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక సామాన్య యువకుడిగా మొదలై, నేడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.