Kollywood Strike: కోలీవుడ్ లో  సమ్మె సెగ..నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి 

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:34 AM

తమిళ సినీ పరిశ్రమలో(kollywood) మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమా నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ-FefSi)) స్పందించింది.

తమిళ సినీ పరిశ్రమలో(kollywood) మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమా నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ-FefSi)) స్పందించింది. సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ పరిశ్రమలోని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేసింది. సమస్యలను సమ్మె ద్వారా పరిష్కరించుకోవడం కంటే, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం ఉత్తమమని సూచించింది. తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు నిర్మాతల మండలి, కార్మిక సంఘాలు కలిసి చర్చలు జరపాలని ఫెఫ్సీ కోరింది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొంది. షూటింగ్‌లు నిలిచిపోవడం వల్ల తాత్కాలికంగా సమస్యలు పరిష్కారమైనట్లు కనిపించినా, దీర్ఘకాలంలో పరిశ్రమకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

వేలాది కుటుంబాలపై ప్రభావం

సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో చాలామంది రోజువారీ పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. షూటింగ్‌లు నిలిచిపోతే వారి ఆదాయానికి నేరుగా గండిపడుతుంది. కార్మికుల కుటుంబాల జీవనోపాధిపై దీని ప్రభావం పడుతుంది. అందువల్ల సమ్మె నిర్ణయం తీసుకునే ముందు దాని వల్ల కలిగే పరిణామాలను అన్ని వర్గాలు పరిగణనలోకి తీసుకోవాలని ఫెఫ్సీ సూచించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల షెడ్యూళ్లు మారడంతో పాటు నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది.

2023 సమ్మెను గుర్తు చేసిన ఫెఫ్సీ

2023లో దాదాపు 45–50 రోజుల పాటు సమ్మె జరిగిన విషయాన్ని ఫెఫ్సీ గుర్తుచేసింది. ఆ సమయంలో పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరోసారి అదే పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

పరిశ్రమ ప్రయోజనాలే ముఖ్యం

సమ్మె కొనసాగితే నిర్మాతలు, కార్మికులు మాత్రమే కాకుండా మొత్తం తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఫెఫ్సీ హెచ్చరించింది. సినిమా నిర్మాణం, విడుదలలు, థియేటర్లు, అనుబంధ రంగాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం, నిర్మాతలు, కార్మిక సంఘాలు, ఫెఫ్సీ సహా అన్ని వర్గాలు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. పరస్పర అవగాహన, సహకారంతో సానుకూల పరిష్కారాన్ని కనుగొంటేనే పరిశ్రమకు మేలు జరుగుతుందని తెలిపింది.

 

Updated Date - Aug 25 , 2026 | 12:50 PM