మా కాన్వాయ్ వెంట పరుగులు పెట్టొద్దు!
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:22 PM
మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు యువత బానిస కావొద్దని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు.
మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు యువత బానిస కావొద్దని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ‘జైలర్-2’ (Jailer 2) చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ముగించుకుని ఆయన బుధవారం చెన్నైకు తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. ‘యువత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీల కాన్వాయ్ వెంట పరుగులు తీయవద్దు. అనుకోకుండా దెబ్బ తగిలితే గాయపడి, బాధ పడాల్సి ఉంటుంది అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. యువత చదువుకునే సమయంలో కేవలం చదువు పైనే దృష్టి పెట్టాలి. లేకపోతే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాయామం ఉపయోగాలను గుర్తించాలి. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిసలు కావొద్దు. మత్తుపదారాలకు అలవాటు పడితే జీవితం నరకప్రాయమవుతుంది. మత్తుపదార్థాల అలవాట్లు ఉన్న స్నేహితులు ఎవరైనా ఉంటే వారిని దూరంగా ఉంచండి’ అని హితవు పలికారు. విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ విడుదల ఆలస్యంపై ప్రస్తావించగా ‘సారీ.. నో కామెంట్’ అంటూ సమాధానం దాటవేశారు.