Vijay: ఇది గొప్ప ఆరంభం అంటూ దర్శకుల ప్రశంసలు..
ABN, Publish Date - May 23 , 2026 | 08:20 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో కొలువుదీరిన మంత్రివర్గంపై సినీ దర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో కొలువుదీరిన మంత్రివర్గంపై సినీ దర్శకులు మారి సెల్వరాజ్, పా. రంజిత్ ప్రశంసల వర్షం కురిపించారు. కేబినెట్ కూర్పులో సామాజిక న్యాయపరిరక్షణ సుస్పష్టంగా కనిపిస్తుందని వారు ట్వీట్ చేశారు. ‘సామాజిక న్యాయంపై విశ్వాసాన్ని పెంపొందించేలా ముఖ్యమంత్రి విజయ్ తన మంత్రివర్గాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా టీవీకేకు, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు నా అభినందనలు. కొత్త మంత్రివర్గంలో అన్ని వర్గాల వారు ప్రాతినిధ్యం వహించారని, వీరంతా ప్రజల కోసం పని చేసి విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అలాగే, పా. రంజిత్ చేసిన ట్వీట్‌లో 'విజయ్ మంత్రివర్గంలో షెడ్యూల్ కులాలకు చెందిన ఏడుగురుకి చోటుదక్కడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మంత్రివర్గ కూర్పు కేవలం టీవీకేకు మాత్రమే కాకుండా, రాష్ట్రానికి కూడా గొప్ప ఆరంభం అవుతుందని విశ్వసిస్తున్నాను. సామాజిక న్యాయ రాజకీయాలలో సామాజిక ప్రాతినిధ్యం మొదటి మెట్టు. ఈ అవకాశాలు సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, సమాజంలో సమానత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి దారితీయాలి. ఇలాంటి ఆదర్శప్రాయమైన ప్రాతినిధ్యాలు సామాజిక మార్పునకు పునాది వేసినపుడు అవి భవిష్యత్‌లో మరింత సమగ్రమైన మార్పులకు అవకాశాలను కూడా సృష్టిస్తాయి. ఈ మంత్రివర్గం సరికొత్త మార్పుకు కృషి చేస్తుందని ఆశిస్తూ సీఎంకు అభినందనలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు.
Updated at - May 23 , 2026 | 10:47 AM