దర్శకుడు.. సుందర్ మోసం చేసి బెదిరిస్తున్నాడు! కమిషనరేట్‌లో.. నిర్మాత ఫిర్యాదు

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:16 AM

ప్రముఖ సినీ దర్శకుడు, సీనియ‌ర్ న‌టి ఖుష్బూ భ‌ర్త‌ సుందర్ తనను మోసం చేశారంటూ సినీ నిర్మాత మణికంఠ రామన్ ఆరోపించారు.

Sundar C

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో పుదియ నీతి కట్చి తరపున Puthiya Needhi Katchi (PNK) మదురై సెంట్రల్ (Madurai Central Assembly Constituency) స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సీనియ‌ర్ న‌టి ఖుష్బూ భ‌ర్త‌, సినీ దర్శకుడు, సుందర్ (Sundar C) తనను మోసం చేశారంటూ సినీ నిర్మాత మణికంఠ రామన్ ( Manikantan Raman) ఆరోపించారు. ఈ విషయంపై ఆయన చెన్నై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఒక సినిమా నిర్మాణం కోసం ఇచ్చిన అడ్వాన్స్ సొమ్ము తిరిగివ్వకుండా తమను బెదిరిస్తున్నారని, ఆయనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివరాలను పరిశీ లిస్తే, కలగలప్పు 3 (Kalakalappu 3) మూవీ కోసం సుందరిని సంప్రదించగా, రూ.20 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసేలా, సుందర్‌కి రెమ్యునరేషన్‌గా రూ.5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం ముందస్తుగా సుందరికి రూ.50 లక్షల, ఇతర నటీ నటులకు రూ.59 లక్షలు అడ్వాన్స్ రూపేణా చెల్లించారు. అయితే, అనుకున్న ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. అదే సమయంలో ఆయన దర్శకత్వం వహించిన 'అరణ్మనై-4' చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది.

దీంతో సుందర్ రెమ్యునరేషన్‌గా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, సినిమా బడ్జెట్‌ను రూ.30 కోట్లకు పెంచేశారు. ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. దీంతో అడ్వాన్స్ సొమ్ము తిరిగివ్వాలని కోరగా తమను బెదిరిస్తున్నారు. అందువల్ల ఆయనపై కేసు నమోదు చేసి న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని నిర్మాత మణికంఠ రామన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 09:44 AM