Chinmayi: 'ద్రౌపది 2'నుండి చిన్మయి సాంగ్ అవుట్!

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:53 PM

'ద్రౌపది 2' సినిమా కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాటను తొలగించి, వేరే వారితో తిరిగి పాడిస్తానని దర్శకుడు మోహన్ జీ చెబుతున్నాడు. ఈ సినిమాపై చిన్మయి నెగెటివ్ ప్రచారం చేస్తుండటమే దీనికి కారణమని ఆయన అంటున్నారు.

Chinmayi Sripada

అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) కు, దర్శకుడు మోహన్ జీ (Mohan G) కి మధ్య మొదలైన వివాదం ఇప్పటికీ రగులుతున్న రావణ కాష్ఠాన్ని తలపిస్తోంది. ఆరేళ్ళ ముందు దర్శకుడు మోహన్ జీ తీసిన 'ద్రౌపది' (Dhraupathi) చిత్రంలోని కొన్ని అంశాలను మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు తీవ్రంగా విమర్శించారు. ఈ మూవీ కంటెంట్ చాలా అభ్యంతరకరంగా ఉందని వాపోయారు. ముఖ్యంగా 'ద్రౌపది' చిత్రం ద్వారా మహిళలను మోహన్ జీ కించపరిచాడని గొడవ చేశారు. అలా ఈ సినిమాను, మోహన్ జీ ని విమర్శించిన వారిలో చిన్మయి శ్రీపాద కూడా ఉన్నారు. హిందూ సమాజంలోని కులాల మధ్య ఇలాంటి సినిమాలు తీసి మోహన్ జీ గొడవపెడుతున్నారని ఆమె ఆరోపించారు. అయితే చిన్మయి కేవలం ఒక వర్గం గురించి మాత్రమే మాట్లాడుతోందని, ఆమెది పక్షపాత ధోరణి అని మోహన్ జీ బదులిచ్చారు. కొద్ది రోజులకు ఈ వివాదం సద్దుమణిగిపోయింది. అందరూ దీని గురించి మర్చిపోయారు.


తాజాగా మోహన్ జీ 'ద్రౌపది 2' సినిమాను అనౌన్స్ చేశాడు. షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా పాటలు కొన్నింటిని రికార్డ్ కూడా చేయించాడు. చిత్రం ఏమంటే ఈ సినిమా సంగీత దర్శకుడు డి. ఇమాన్ గాయని చిన్మయితో ఓ పాట పాడించాడు. దాని రికార్డింగ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత 'తాను పాట పాడింది ద్రౌపది 2' సినిమా కోసమని చిన్మయికి తెలిసింది. తనకు సినిమా పేరు చెప్పకుండా ఈ పాట పాడించారని, మోహన్ జీ అభిప్రాయలతో తాను ఎప్పటికీ ఏకీభవించలేనని, తన వ్యక్తిగత అభిప్రాయాలకు భిన్నంగా ఉండే ఈ సినిమాలో పాట పాడి తప్పు చేశానని సోషల్ మీడియా వేదికగా చిన్మయి వివరణ ఇచ్చింది. సంగీత దర్శకుడు ఇమాన్ తో ఉన్న అనుబంధం కారణంగా తాను ఈ పాట ఏ సినిమా కోసం రికార్డ్ చేస్తున్నారో కూడా తెలుసుకోలేదని చెప్పింది. అయితే చిన్మయి ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో సహజంగా 'ద్రౌపది 2' సినిమాకు విశేషమైన ప్రచారం వచ్చింది. అయితే ఈ నెగెటివ్ ప్రచారం చినికి చినికి గాలివానగా మారుతుందని గ్రహించిన దర్శకుడు మోహన్ జీ ఇప్పుడు చిన్మయి పాడిన పాటను వేరే వారితో మరోసారి పాటించబోతున్నాడట. చిన్మయి పాట తీసేసి ఈ కొత్త వర్షన్ ను అందులో యాడ్ చేస్తానని చెబుతున్నాడు. చాలా సందర్భాలలో ఒక సింగర్ పాడిన పాటను... ఆ తర్వాత మరో సింగర్ తో తిరిగి పాడించడం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ స్టార్ సింగర్ చిన్మయి విషయంలోనూ అది చోటు చేసుకోవడం విశేషం. మరి ఈ విషయంలో ఇప్పుడు చిన్మయి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - Jan 06 , 2026 | 01:53 PM