ఇరవై యేళ్ళ తర్వాత 'పుదుపేట్టై'కు సీక్వెల్!

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:27 PM

ధనుష్‌, సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో ఐదవ సినిమా రాబోతోంది. ఇరవై యేళ్ళ క్రితం వీరి కాంబోలో రూపుదిద్దుకున్న 'పుదుపేట్టై'కు త్వరలో సీక్వెల్ రానుంది. దీని స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని సెల్వ రాఘవన్ తెలిపారు.

Dhanush - Selvaraghavan

ధనుష్‌ (Dhanush) హీరోగా అతని అన్నయ్య సెల్వ రాఘవన్ (Selvaraghavan) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం 'కాదల్ కొండేన్‌'. ఇది 2003లో విడుదలైంది. దీనిని తెలుగులో 'నేను'గా రీమేక్‌ చేశారు. అందులో 'అల్లరి' నరేశ్‌ (Allari Naresh) హీరోగా నటించాడు. ఆ తర్వాత సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్‌ 'పుదుపేట్టై' (Pudhupettai) మూవీలో యాక్ట్ చేశాడు. 2006లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాను 'ధూల్ పేట' పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఆ తర్వాత ఐదేళ్ళకు 2011లో 'మయక్కమ్ ఎన్న' అనే మూవీ వీరిద్దరూ కలిసి చేశారు. ఈ సినిమా చాలా ఆలస్యంగా తెలుగులో 'మిస్టర్ కార్తీక్' పేరుతో డబ్ అయ్యింది. ఇక వీరిద్దరూ కలిసి చేసిన నాలుగో సినిమా 'నానే వరువేన్‌' (Naane Varuvean). ఈ సినిమా కూడా తెలుగులో 'నేనే వస్తున్నా' పేరుతో డబ్ అయ్యింది.


నిజానికి ఈ మూవీ కంటే ముందు 'పుదుపేట్టై'కు సీక్వెల్ చేయాలని సెల్వ రాఘవన్ అనుకున్నాడు. కానీ కుదురలేదు. అప్పటి నుంచి అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు కదలిక వచ్చింది. తాజాగా సెల్వ రాఘవన్ 'పుదుపేట్టై' మూవీ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దాంతో అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని భావిస్తున్నారు. ధనుష్‌ సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలిమ్స్ తో పాటు ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌. థాను (Kalaipuli S. Thanu) వి క్రియేషన్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. 'పుదుపేట్టై' సినిమాలో స్నేహ కీలక పాత్రను పోషించింది. మరి ఇప్పుడు కూడా ఆమెనే ఈ మూవీలో తీసుకుంటారో లేదో చూడాలి. దాదాపు ఇరవై యేళ్ళ తర్వాత 'పుదుపేట్టై'కు సీక్వెల్ రానుండటం విశేషమే. ఏదేమైనా... ధనుష్‌, సెల్వ రాఘవన్ కాంబోలో మూవీ అంటే సమ్ థింగ్ స్పెషల్‌గా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందువల్ల 'పుదుపేట్టై' సీక్వెల్‌కు ఇప్పటి నుండే క్రేజ్‌ ఏర్పడింది.

Updated Date - Mar 20 , 2026 | 04:29 PM