కొడుకు కోసం ధనుష్ భారీ రిస్క్
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:29 PM
టాలీవుడ్ స్టార్ హీరో చేయని ఆ సాహసాన్ని కోలీవుడ్ హీరో చేస్తున్నాడు. రిస్క్ అని తెలిసినా ముందుకే పోతున్నాడు. కొడుకు కోసం ఆ హీరో చేస్తున్న పని ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలోకి వారసులు రావడం అనేది చాలా కామన్. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. తమ పిల్లలను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను స్టార్ డైరెక్టర్స్ చేతిలో పెట్టాలని భావిస్తుంటారు. కానీ కొందరు మాత్రం.. తామే స్వయంగా మెగాఫోన్ పట్టి.. తమ చేతుల మీదుగానే కొడుకులను లాంచ్ చేయాలని ఆరాట పడుతుంటారు. అలా తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తానని, ఆ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తానని ఆ మధ్య నందమూరి నట సింహం బాలకృష్ణ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ అనౌన్స్‌మెంట్‌కే పరిమితమైంది కానీ పట్టాలెక్కలేదు. కారణాలు తెలియవుకానీ ఆ తర్వాత వేరే దర్శకుడితో అయినా మోక్షజ్ఞను పరిచయం చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే అదీ జరగలేదు. కానీ ఇదే పనిని కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు చేసి చూపించబోతుండటం ఆసక్తి రేపుతోంది.
తన పెద్ద కొడుకు యాత్ర రాజాను హీరోగా లాంచ్ చేసేందుకు ధనుష్ సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాకు ధనుషే స్వయంగా కథ అందించి, డైరెక్షన్ చేయబోతున్నాడు. అంతటితో ఆగకుండా.. తన సొంత బ్యానర్ 'వండర్‌బార్ స్టూడియోస్' పైనే ఈ చిత్రాన్ని ఆయనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. స్టార్ హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం కొత్త కాకపోయినా.. ఒక తండ్రిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా.. ఈ మూడు బాధ్యతలను ధనుష్ తన భుజాలపైకి ఎత్తుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
ఈ మెగా లాంచ్ కోసం ఇప్పటికే యాత్ర రాజా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరగబోతోందని తెలుస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ ధనుష్‌కి ఒక రకంగా అగ్నిపరీక్షే అని చెప్పాలి. ఎందుకంటే.. దర్శకుడిగా ఆయన ఇటీవల తీసిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయాయి. దాంతో.. ఇప్పుడు కొడుకును స్టార్‌గా నిలబెట్టడంతో పాటు, దర్శకుడిగా బాక్సాఫీస్‌ను షేక్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత ధనుష్‌పై పడింది. ఇదిలా ఉంటే... ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్