Dhanush: విజయం శిఖరాన ఉన్నా.. గురువుల పాదాల వద్దే ధనుష్
ABN , Publish Date - Aug 06 , 2026 | 08:26 AM
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాను చిన్ననాటి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న పాఠశాలకు సొంత ఖర్చుతో మూడంతస్తుల నూతన భవనాన్ని నిర్మించి విద్యపై తనకున్న గౌరవాన్ని చాటారు.
తమిళనాడులోని సాలిగ్రామంలో ఉన్న థాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్లో ధనుష్ ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు చదువుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో శిథిలావస్థకు చేరిన పాత భవనం స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తుల భవనాన్ని ఆయన స్వయంగా నిర్మించారు. ఈ నూతన భవనాన్ని ధనుష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో కలిసి చదువుకున్న సినిమాటోగ్రాఫర్ కుమరన్, 1999 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు, ధనుష్ సోదరీమణులు కార్తికాదేవి, విమలగీత, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ధనుష్ పాదాభివందనం చేయడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అనంతరం ప్రతి ఉపాధ్యాయుడితో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన విజయానికి పునాది వేసిన పాఠశాలకు తిరిగి సేవ చేయాలనే ధనుష్ ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు. విజయం శిఖరాన ఉన్నా.. గురువుల పాదాల వద్దే ధనుష్ అని గురువుల పట్ల ఆయన చూపిన గౌరవం, పాఠశాల అభివృద్ధికి చేసిన సహాయం అభిమానులతో పాటు నెటిజన్ల మనసులను కూడా గెలుచుకుంటోంది.