Deepshikha Chandran: తమిళ, కన్నడ మీదుగా తెలుగులోకి...
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:14 AM
తమిళ, కన్నడ చిత్రాలలో నాయికగా నటించిన దీప్సిఖా చంద్రన్ ఇప్పుడు తెలుగు సినిమా కూడా చేస్తోంది. సూర్య వశిష్ఠ హీరోగా నటిస్తున్న 'రమణీ కళ్యాణం'లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
గత యేడాది విడుదలైన విజయ్ ఆంటోని (Vijay Antony) 'మార్గన్' (Maargan) చిత్రంలో కీలక పాత్ర పోషించింది దీప్సిఖా చంద్రన్ (Deepshikha Chandran). అంతేకాదు... ఈ యేడాది ప్రారంభంలో వచ్చిన కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) 'మార్క్' (Mark) లోనూ ఆమె హీరోయిన్ గా నటించి అందరి దృష్టినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 25న కన్నడలో 'మార్క్' మూవీ విడుదల కాగా తెలుగులో ఓ వారం ఆలస్యం వచ్చింది. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి మనసులోని భావాలను దీప్సిఖా చంద్రన్ ఇటీవల వ్యక్తం చేసింది.

'మార్క్' సినిమాతో తనకొచ్చిన మాస్ హీరోయిన్ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు దీప్సిఖా తెలిపింది. 'మార్క్ లోని పాత్ర పట్ల నిజంగా చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న స్పందన నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మాస్ హీరోయిన్ అనే ట్యాగ్ ప్రెషర్‌గా కాకుండా ఒక ఆశీర్వాదంలా అనిపిస్తోంది. ఆడియన్స్ నన్ను స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌లో అంగీకరించడం నా కెరీర్‌లో చాలా పెద్ద విజయం. నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నాను' అని తెలిపింది. కిచ్చా సుదీప్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతూ, 'సుదీప్ గారితో కలిసి నటించడం గౌరవం భావిస్తున్నాను. ఆయనతో పని చేయడం ఒక లెర్నింగ్ స్కూల్ లాంటిది. ఆయన డిసిప్లిన్, ఫోకస్, కో-ఆర్టిస్ట్స్‌కి ఇచ్చే గౌరవం అద్భుతం. సెట్లో ఆయన ప్రెజెన్స్ చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. అంత పెద్ద స్టార్ అయిన అందరితో కలివిడిగా వుంటారు. నటన విషయంలో చాలా ప్రోత్సహిస్తారు' అని చెప్పింది.

తమిళ చిత్రం 'మార్గన్'లో నటించినప్పుడు విజయ్ ఆంటోని ఎంతో బాగా తనని చూసుకున్నారని చెబుతూ, 'ఏ అంశాన్ని అయినా స్వీకరించాలనే గొప్ప మాటను ఆయన ఆ సినిమా షూటింగ్ లో తనకు చెప్పారని, అప్పటి నుండీ అదే ఫాలో అవుతున్నానని, విజయ్ ఆంటోని చాలా కూల్ గా, కామ్ గా ఉండే వ్యక్తి' అని దీప్సిఖా తెలిపింది. ఇప్పటికే పలు యాడ్స్ లో నటిస్తున్న ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అలానే ఇంతవరకూ డబ్బింగ్ మూవీస్ తోనే తెలుగువారి ముందుకు వచ్చిన దీప్సిఖా చంద్రన్ త్వరలోనే స్ట్రయిట్ తెలుగు మూవీ 'రమణీ కళ్యాణం' (Ramani Kalyanam) ద్వారా రాబోతోంది. సూర్య వశిష్ఠ్ హీరోగా నటించిన ఈ సినిమాలో తన పాత్ర చాలా లేయర్స్ తో ఉంటుందని, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండే పాత్ర తనదని, సూర్య తో కెమిస్ట్రీ చాలా నేచురల్ గా, రియలిస్టిక్ గా ఉంటుంద'ని చెప్పింది. ఆ సినిమా ప్రమోషన్స్ సమయానికి తాను తెలుగు నేర్చుకుంటానని, అవకాశం ఇస్తే తన పాత్రకు తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకుంటానని దీప్సిఖా చంద్రన్ తెలిపింది. టాలీవుడ్ లో చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారని, అయితే అవకాశం వస్తే అల్లు అర్జున్ (Allu Arjun) తో కలిసి పనిచేయాలనుకుంటున్నాని తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.