Jana Nayagan: విజ‌య్‌కు చుక్కెదురు.. అక్క‌డే తేల్చుకోమ‌న్న సుప్రీం కోర్టు

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:13 PM

దళపతి విజయ్ చిత్ర నిర్మాతలకు సుప్రీమ్ కోర్టులో చుక్కెదురైంది. ఈ సమయంలో ఈ కేసులో తాము తలదూర్చలేమని, మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోమని సుప్రీమ్ న్యాయమూర్తులు తెలిపారు.

Jana Nayagan Movie

దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్నే అందించింది. అతను నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ఆదేశాలు జారీ చేయమంటూ నిర్మాతలు సుప్రీమ్ కోర్టు తలుపు తట్టగా, అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసులో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. దాంతో పిటీషనర్ తరఫు న్యాయవాది రోహత్గి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, వీలైనంత త్వరగా తీర్పు ఇచ్చేలా చూడమని న్యాయమూర్తులకు విన్నవించుకున్నారు. రోహత్గి అభ్యర్థన మేరకు ఈ కేసును మద్రాసు హైకోర్టు లోనే తేల్చుకోమని, అయితే ఈ నెల 20లోగా తీర్పును వెలువర్చమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషి పేర్కొన్నారు.


మద్రాస్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ప్రతికూల తీర్పుపై సి.బి.ఎఫ్.సి. ద్విసభ్య ధర్మాసనంకు వెళ్ళింది. కేసును ప్రాధమికంగా విచారించిన న్యాయమూర్తులు సినిమా విడుదల అనుమతిపై స్టే విధించి, కేసును ఈ నెల 20కు వాయిదా వేశారు. దాంతో 'జన నాయగన్' నిర్మాత సుప్రీమ్ కోర్టు కు వెళ్ళి తమకు న్యాయం చేయమని కోరారు. కానీ అక్కడ కూడా వారికి చుక్కెదురై తిరిగి ఈ వ్యవహారం చెన్నయ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కోర్టులో పడినట్టు అయ్యింది. ఈ లోగా రివైజింగ్ కమిటీ సినిమాను చూసి ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి. వాటిని నిర్మాతలు అంగీకరిస్తే, సినిమా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకవేళ కోర్టు కూడా సుప్రీమ్ కోర్టు సూచనలను అనుసరించి, 20వ తేదీకి తుది తీర్పు ఇచ్చినా... ఈ నెల 23వ తేదీ లేదా 30న 'జన నాయగన్' జనం ముందుకు రావచ్చు.

Updated Date - Jan 15 , 2026 | 12:59 PM