అల్లు వర్సెస్ యశ్ కాంట్రవర్సీ.. బన్నీ సినిమాకు ఎసరు పెట్టిన టాక్సిక్ హీరో!
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:34 PM
కన్నడ స్టార్ హీరో యశ్- లోకేశ్ కనకరాజ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుందట.. ఇంతకు ముందు లోకేశ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తో సినిమా అని ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు బన్నీతో మూవీ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా అల్లు వర్సెస్ యశ్ కాంట్రవర్సీ కూడా సాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ వార్త మరింత ఆసక్తి కలిగిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో ఓ మూవీ ఉంటుందని ప్రకటించారు. అయితే బన్నీ - అట్లీ మూవీ 'రాకా' పూర్తి కావడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉన్న కారణంగా లోకేశ్తో ప్రాజెక్ట్ ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఈ లోగా కన్నడ స్టార్ యశ్తో లోకేశ్ డైరెక్షన్లో ఓ సినిమా ఉంటుందని విశేషంగా వినిపిస్తోంది. యశ్తో లోకేశ్ సినిమా అంటే విశేషమేమీ కాదు. కానీ, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఎప్పుడో మూడేళ్ళ క్రితం చేసిన కామెంట్ను ఇప్పుడు యశ్ (Yash) టాక్సిక్ (Toxic) దెబ్బ తినడంతో సోషల్ మీడియాలో తిప్పేస్తున్నారు. అందుకు యశ్ తల్లి పుష్ప ఘాటుగా స్పందిస్తూ తన కొడుకు కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చారని అన్నారు. అలా సోషల్ మీడియా కారణంగా అల్లు వర్సెస్ యశ్ కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్తో సినిమా అని చెప్పిన లోకేశ్ కనగరాజ్, యశ్తో మూవీ చేస్తారని తెలియడం సినీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వాస్తవానికి యశ్ వైపు నుండి కానీ, లోకేశ్ కనగరాజ్ దగ్గర నుంచి కానీ వారి కాంబోపై ఏ లాంటి ప్రకటన రాలేదు. అందువల్ల యశ్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ సంగతి ఎవరికీ తెలియదు. అయినా, యశ్ -లోకేశ్ కాంబో కనుక సెట్ అయితే ఆ ప్రాజెక్ట్ పై చిలువలు పలువలుగా కథలు వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మూడేళ్ళ క్రితం ఓ వేడుకలో మాట్లాడుతూ అరవింద్ 'కేజీఎఫ్ కు ముందు యశ్ నథింగ్' అన్నారు. ఆ సినిమా తరువాతే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారన్నది అల్లు అరవింద్ ఉద్దేశం. అయితే కొందరు అదే పనిగా అప్పట్లో అరవింద్ మాటలను ఇప్పుడు 'టాక్సిక్' ఫ్లాప్ అయిన సమయంలో సామాజిక మాధ్యమంలో తిప్పుతూ ఉండడం విశేషంగా మారింది. తన కొడుకు నటించిన 'టాక్సిక్' మూవీకి కొందరు అదే పనిగా బ్యాడ్ టాక్ తెస్తున్నారని యశ్ తల్లి ఆవేదన చెందారు. ఇలా అల్లు వర్సెస్ యశ్ అన్నది సోషల్ మీడియానే క్రియేట్ చేయడం గమనార్హం.
'డోంట్ కేర్' అంటూ సాగే పాత్రలను పోషించడంలో యశ్ అలరిస్తారని 'కేజీఎఫ్' సిరీస్ ప్రూవ్ చేసింది.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాలు సైతం అదే తీరున తెరకెక్కుతూ ఉంటాయి. కాబట్టి యశ్ - లోకేశ్ కాంబో సెట్ అయితే భలేగా ఉంటుందని కన్నడ సినీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బన్నీ లాంటి టాప్ స్టార్ మూవీని అనౌన్స్ చేసిన లోకేశ్ కనగరాజ్ వేరే వైపు చూస్తారనీ చెప్పడానికి వీలు లేదు. అయితే బన్నీ- జెట్లీ 'రాకా'ఆలస్యం అయితే ఆ లోగా యశ్ తో సినిమా చేసేయవచ్చునని లోకేశ్ భావిస్తున్నారేమో అని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా యశ్ - లోకేశ్ కనగరాజ్ మూవీ ఓకే అయితే దానికి ఇప్పటి నుంచే పబ్లిసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి.