కమెడియన్ వివేక్ మరణం, కరోనా వ్యాక్సిన్ వివాదం.. మన్సూర్ అలీ ఖాన్ కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Sep 27 , 2026 | 07:50 AM
కరోనా వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై నమోదైన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేయాలని ఆదేశించింది.
కరోనా మహమ్మారి సమయంలో కరోనా వ్యాక్సిన్ (Covid Vaccine)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటుడు మన్సూర్ ఆలీఖాన్ (Mansoor Ali Khan) పై నమోదైన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేయాలని ఆదేశించింది. గత 2021లో కోవిడ్ సమయంలో నటుడు వివేక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజు గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
ఆయనను చూసేందుకు వెళ్ళిన నటుడు మన్సూర్ అలీ ఖాన్. కరోనా వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన వ్యాధి నివారణ చర్యలకు, ప్రభుత్వ ప్రజా సంక్షేమ పనులకు వ్వతిరే కంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొంటూ మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోడంబాక్కం జోనల్ మెడికల్ ఆఫీసర్ భూపేష్ స్థానిక వడపళని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రజాశాంతికి భంగం కలిగించడం, అంటు వ్యాధిని వ్యాప్తి చేసే దురుద్దేశంతో ప్రవర్తించడం. ప్రజలలో తప్పుడు అభిప్రాయాలను వ్యాప్తి చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులను కొట్టి వేయాలని కోరుతూ మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను వ్యాక్సిన్‌పై ఎలాంటి నిందలు వేయలేదని, తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జీకే ఇలంద్రియన్. మన్సూర్పై వడపళని పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆదేశించారు..