చంద్రబోస్‌కు శ్రీకృష్ణదేవరాయల ఉగాది పురస్కారం

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:55 PM

బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి ఆస్కార్ విజేత చంద్రబోస్‌ను, కన్నడ సంగీత దర్శకుడు గురుకిరణ్‌ను శ్రీకృష్ణదేవరాయల ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర రవాణా, దేవాదాయ శాఖా మంత్రి రామలింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Chandra Bose

బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఇటీవల బెంగళూరులో ఆత్మీయుల సమక్షంలో జరిగింది. తెలుగు నుండి ఆస్కార్ విజేత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ (Chandra Bose), కన్నడ నుండి ప్రముఖ సంగీత దర్శకుడు గురు కిరణ్‌ (Gurukiran)ఈ పురస్కారాన్ని స్వీకరించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక రవాణా, దేవాదాయ శాఖామంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్యే అశ్వద్థ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు రాధాకృష్ణ రాజు మాట్లాడుతూ, 'తెలుగు, కన్నడ భాషలను, ప్రజలను మమేకం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఒకే వేదికపై ఇటు తెలుగు, అటు కన్నడ ప్రముఖులను కొన్నేళ్ళుగా సత్కరిస్తున్నామని అన్నారు. మహానటుడు ఎన్టీఆర్‌ (NTR)తో శ్రీకృష్ణదేవరాయల పురస్కారాన్ని ప్రారంభించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంతోమంది తెలుగు, కన్నడ ప్రతిభావంతులను సన్మానించామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ మాట్లాడుతూ, 'బెంగళూరులో తెలుగువారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింద'ని తెలిపారు. కార్యక్రమానంతరం చంద్రబోస్‌, గురుకిరణ్‌ టీటీడీ శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనంతో వీరిని సత్కరించారు. టీటీడీ ఎల్ఏసీ ఛైర్మన్‌ కనకమేడల వీరాస్వామి వీరికి తీర్థ ప్రసాదాలను అందచేశారు.

Updated Date - Mar 23 , 2026 | 01:56 PM