భాను డైరెక్షన్‌లో చంద్రబాబు బయోపిక్!
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:07 PM
వెండితెరపైకి ఏపీ సీఎం చంద్రబాబు జీవితం. 'రాజధాని ఫైల్స్' ఫేమ్ భాను డైరెక్షన్‌లో సినిమా. ప్రపంచ భాషల్లో చిత్ర రూపకల్పనకు పథక రచన
‘రాజధాని ఫైల్స్’ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు భాను. అతని దర్శకత్వంలో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం రూపుదిద్దుకోబోతోంది. భాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్య సంఘటనలను ప్రధానాంశంగా చేసుకుని ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు.
ఈ విషయాన్ని దర్శకుడు భాను తెలియచేస్తూ, 'సామాన్యుడిగా జీవితం ప్రారంభించి ప్రపంచం మెప్పుపొంది, దార్శనికుడిగా, లోకనాయకుడిగా చంద్రబాబు ఎదిగిన ప్రయాణం దేశంలోని ప్రతీ పౌరుడికీ ఆదర్శప్రాయమని, నిఘంటువులోని ప్రతి అక్షరానికీ ఒక అర్థం - ప్రతి పదానికీ ఒక భావం ఉన్నట్టే ఆయన జీవితంలోని ప్రతి అడుగూ ప్రజాక్షేమం కోసమేనని, ఆయన ప్రతీ ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసమేనని ఇలాంటి విజనరీ నాయకుడు, అలుపెరగని పోరాట యోధుడు, నిత్యకృషీవలుడు చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతీ ఘట్టంలో ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని ఆ ఉద్వేగాల సమాహారమే ఈ బయోపిక్' అని అన్నాడు.
దీనిని పాన్ వరల్డ్ చిత్రంగా అన్ని ప్రపంచభాషల్లోనూ రూపొందిస్తున్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో, భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమా టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు, షూటింగ్ విశేషాలు, ఇతర సమాచారం త్వరలోనే దర్శకుడు భాను మీడియాకు తెలియజేయనున్నారు.