మామా అల్లుళ్ళ బస్తీమే సవాల్.. దసరాకి తమిళనాట అసలైన ఫైట్!
ABN , Publish Date - Jul 10 , 2026 | 06:20 AM
పండగ సీజన్ వస్తుందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో కోలాహలం నెలకొంటుంది. మన టాలీవుడ్ నాట కూడా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు రెడీ అవుతుండగా, అందరిచూపు మాత్రం కోలీవుడ్ మీద పడింది.
పండగ సీజన్ వస్తుందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో కోలాహలం నెలకొంటుంది. మన టాలీవుడ్ నాట కూడా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు రెడీ అవుతుండగా, అందరిచూపు మాత్రం కోలీవుడ్ మీద పడింది. ఈ ఏడాది దసరా బరిలో ఒక బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. ఒకవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. మరోవైపు నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన ధనుష్ (Dhanush). ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద తలపడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో జైలర్ 2 (Jailer 2) కచ్చితంగా టాప్ లిస్ట్ లో ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, డార్క్ కామెడీ స్పెషలిస్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ ఫస్ట్ పార్ట్ ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముత్తువేల్ పాండియన్ గా తలైవర్ స్క్రీన్ ప్రెజెన్స్, దానికి అనిరుధ్ ఇచ్చిన ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 పై అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మేకర్స్, రీసెంట్ గానే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 15న దసరా కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీసుకువస్తున్నట్టు ప్రకటించడంతో తలైవర్ అభిమానుల సంబరాలు మొదలైపోయాయి.
అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. జైలర్ 2 రాకకు ముందే, ధనుష్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఓం (Om) చాప్టర్ 1 అక్టోబర్ 16న రిలీజ్ కి లాక్ చేసి ఉంచారు. ధనుష్ తన ప్రతి సినిమాలోనూ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు. ఈ ఓం సినిమా కూడా ఆయన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. ఎప్పుడైతే జైలర్ 2 అక్టోబర్ 15కి ఫిక్స్ అయిందో.. ఇక ధనుష్ సినిమా కచ్చితంగా వాయిదా పడుతుందని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. సూపర్ స్టార్ కి ఎదురెళ్లడం ఎందుకులే అని కచ్చితంగా రిలీజ్ డేట్ మారుస్తారని అంతా భావించారు. కానీ, బాక్సాఫీస్ బరిలో వెనక్కి తగ్గేది లేదని ధనుష్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, వెర్సటైల్ నటుడు నసీరుద్దీన్ షా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఆయన రాకతో సినిమా పాన్ ఇండియా అప్పీల్ మరింత పెరిగింది.
ఈ క్రేజీ అప్డేట్ తో పాటే, తమ సినిమా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని, ముందుగా అనుకున్నట్టుగానే అక్టోబర్ 16వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా తేల్చి చెప్పారు. దీనిని బట్టి చూస్తే, ఈ దసరాకి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మునుపెన్నడూ చూడని ఫైట్ జరగబోతోందని అర్థమవుతోంది. ఒకపక్క జైలర్ 2.. మరోవైపు ఓం చాప్టర్1 ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. థియేటర్ల పంపకాల దగ్గరి నుంచి ఓపెనింగ్స్ వరకు గట్టి పోటీ తప్పదు. అయితే రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈలోపు ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగి థియేటర్ల సర్దుబాటు కోసం ఎవరైనా ఒకరు వెనక్కి తగ్గుతారా? లేదా సై అంటే సై అంటూ బరిలోకి దిగుతారా? అన్నది వేచి చూడాలి.