బేబమ్మకు బ్యాడ్ టైం.. ‘ఎల్ఎకే మళ్లీ వాయిదా?
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:53 AM
దర్శక హీరో ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్. ఐ.కె) మూవీ విడుదలకు పదేపదే ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఇటీవలికాలంలో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న దర్శక హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తాజాగా నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్. ఐ.కె) (Love Insurance Company) మూవీ విడుదలకు పదేపదే ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత యేడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబరుకు వాయిదా వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాయిదాలు పడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయను న్నట్టు మేకర్స్ ఇటీవల వెల్లడించారు. అయితే.. విడుదల సమయం సమీపిస్తున్నప్పటికీ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించలేదు. దీంతో గత దీపావళికి వచ్చిన ప్రదీప్ చిత్రం డ్యూడ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మళ్ళీ వాయిదా పడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నవుతోందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన కృతిశెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తోండగా ఎస్ జే సూర్య, సీమాన్, యోగిబాబు, గౌరికిషన్ కీలక పాత్రల్లో నటించారు. రౌడీ పిక్చర్స్ పతాకంపై హీరోయిన్ నయనతార, సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానరుపై నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే కృతి నటించిన సినిమాలు అశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ఈ మూవీపైనే గంపెడు అశలు పెట్టుకుంది. తీరా చూస్తే ఇప్పుడు ఈ మూవీ పరిస్థితి ఇలా తయారవడంతో కృతికి కాలం కలిసి రావడం లేదని ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.