Atharvaa Murali: ఇదయం మురళితో.. నాన్నకు ఘన నివాళి
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:43 PM
'ఇదయం మురళి' విజయోత్సవాల్లో హీరో అధర్వ మురళి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి మురళికి ఈ సినిమా ద్వారా ఘన నివాళి అర్పించామని వెల్లడించారు.
తన తండ్రి, దివంగత నటుడు మురళికి చిరస్మరణీయమైన నివాళి అర్పించాలనే తన కోరికను ఇదయం మురళి (Idhayam Murali) చిత్రం నెరవేర్చిందని హీరో అధర్వ మురళి (Atharvaa Murali) తెలిపారు. దర్శక-నిర్మాత ఆకాష్ బాస్కరన్ (Aakash Baskaran) రూపొందించిన ఈ చిత్రంలో అధర్వ, కయదు లోహర్ ( Kayadu Lohar), ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలు నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో అధర్వ మురళి మాట్లాడుతూ.. "ఇది మా స్కూల్ రీయూనియన్‌లా అనిపిస్తోంది. ఆకాష్ బాస్కరన్ నన్ను తొలిసారి కలిసినప్పుడు చెప్పిన కథనే తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఇలాంటి భావోద్వేగభరితమైన సినిమాకు సినిమాటోగ్రఫీ ఎంతో కీలకం. మనోజ్ పరమహంస తన అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్నిచ్చింది" అని అన్నారు.
చిన్ని జయంత్ గురించి ప్రస్తావిస్తూ.. "ఆయన మా నాన్నకు అత్యంత సన్నిహిత మిత్రుడు. తరచూ మా ఇంటికి వచ్చేవారు. ఈ చిత్రంలో ఆయన చెప్పిన ఒక డైలాగ్ నా కళ్లలో నీళ్లు తెప్పించింది. అలాగే 'బొట్టు వైత్త పట్ట నిలా' పాట మా కుటుంబ సభ్యులందరినీ తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది" అని తెలిపారు. చివరగా, "ఈ సినిమాతో మా నాన్న మురళికి ఘన నివాళి అర్పించగలిగాం. ఆ కోరికను దర్శకుడు ఆకాష్ బాస్కరన్ ఒక స్నేహితుడిలా నెరవేర్చారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని అధర్వ మురళి పేర్కొన్నారు.