Seetha Payanam: ఫిబ్రవరి 14న అర్జున్‌ ‘సీతా పయనం’

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:52 PM

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘సీతా పయనం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Seetha Payanam

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కుటుంబానికి చెందిన నిరంజన్ (Niranjan) హీరోగా నటించగా, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు ప్రత్యేక పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అంతేగాక క‌న్న‌డ స్టార్ హీరో, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ఓ స్పెషల్ కామియోలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీని బహుభాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని జి. బాలమురుగన్ అందించగా, డైలాగ్స్‌ను సాయి మాధవ్ బుర్రా రాశారు. యాక్షన్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ చేశారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సంబంధాల నేప‌థ్యంలో రూపొందింది. కాగా ఈ చిత్రం ‘సీతా పయనం’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 02:43 PM