అర్జున్ దాస్ మరో డిఫరెంట్ మూవీ.. 'జాన్ డో' రిలీజ్ ఎప్పుడంటే?
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:37 AM
అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జాన్ డో విడుదలకు ముస్తాబయింది.
ప్రముఖ నటుడు అర్జున్ దాస్ (Arjun Das) ప్రధాన పాత్రలో రూపొందిన జాన్ డో (John Doe) సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్రం బృందం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ మాట్లాడుతూ, 'ఇది నా తొలి తమిళ చిత్రం. ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. కేడీ' సినిమా చూశాక ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం' అని అన్నారు.
హీరోయిన్ సంజన (Sanjana Natarajan) మాట్లాడుతూ.. 'జాన్ డో' మూవీలో భాగమైనందుకు గర్వపడుతున్నాను. చిత్ర బృందం మొత్తం గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. దర్శకురాలు మధుమిత (Madumitha) మాట్లాడుతూ.. " సినిమా సెట్లో ఎక్కువగా గొడవ పడేది దర్శకత్వం, నిర్మాణ విభాగాలే. కానీ, మా మధ్య ఎన్ని విభేదాలున్నప్పటికీ సినిమా విజయవంతం చేసేందుకు కృషి చేశాయి. అందుకే ఈ రెండు బృందాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే, చిత్రీకరణ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' తెలిపారు.
హీరో అర్జున్ దాస్ మాట్లాడుతూ, 'ఈ సిని మాను నమ్మిన నిర్మాతలకు, చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ జర్నీలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనమంతా మళ్ళీ కలిసి పని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు.
కాగా 2019లో 'కేడీ' మూవీకి దర్శకత్వం వహించిన మధుమిత ఈ చిత్రానికి దర్శకురాలు. ఇందులో అర్జున్ దాస్ తొలిసారి చంద్రు అనే పోలీస్ అధికారి పాత్ర పోషించారు. సంజనా నటరాజన్ హీరోయిన్. ఆర్కా మీడియా వర్క్స్ (Arka Media Works) పతాకంపై నిర్మాతలు దేవినేని ప్రసాద్ (Devineni Prasad), శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) సంయుక్తంగా నిర్మించగా తమిళంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేస్తోంది.