A. R. Rahman: రూట్ మార్చిన స్వర మాంత్రికుడు.. నటుడిగా ఎంట్రీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 08:32 AM
ఇటీవల 'పెద్ది' ఫస్ట్ సింగిల్ చికిరి పాటతో మ్యాజిక్ చేసిన రెహమాన్ త్వరలోనే ఓ మూవీలో యాక్టర్‌గా కనిపించబోతున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న 'పెద్ది' సినిమాలోని "చికిరి.. చికిరి" సాంగ్ ఏ తీరున అలరిస్తోందో మ్యూజిక్ లవర్స్ కు తెలుసు. సినిమా రిలీజ్ కు ముందే అతి కొద్దిరోజుల్లోనే ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దాంతో అందరూ ఈ పాటను పాడుకుంటూ, దీనిపై షార్ట్స్ చేస్తూ ఆనందిస్తున్నారు. సంగీత దర్శకునిగా, గాయకునిగా రహమాన్ (A. R. Rahman) మ్యాజిక్ అందరికీ తెలిసిందే. తనలోని మ్యాజిక్ ఇంకా తరిగిపోలేదని 'పెద్ది' సినిమాతో మరోమారు నిరూపించారు రహమాన్.
దాంతో మళ్ళీ రహమాన్ ఫ్యాన్స్ లో జోష్ నెలకొంది. వారికి ఈ న్యూ ఇయర్ లో మరింత హుషారు కలిగించేలా ఎ.ఆర్.రహమాన్ నటునిగా మారుతున్నారన్న సరికొత్త వార్త వినిపిస్తోంది. మనోజ్ ఎన్.ఎస్. (Manoj NS) అనే రచయిత, దర్శకనిర్మాత తమ 'బిహైండ్ ఊడ్స్' అనే బ్యానర్ పై మూన్ వాక్ (Moonwalk)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా (Prabhudeva)ఇందులో ముఖ్యపాత్ర ధరిస్తున్నారు. ఈ 'మూన్ వాక్'లోనే రహమాన్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నారట.
ఇప్పటి దాకా రహమాన్ ఏదో ఆల్బమ్స్ లోనో, కొన్నిచోట్ల గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారే తప్ప ఏ నాడూ పూర్తిస్థాయిలో నటునిగా తెరపై కనిపించలేదు. 'మూన్ వాక్' మూవీలో మాత్రం రహమాన్ ఫుల్ లెన్త్ కేరెక్టర్ లోనే కనిపించబోతున్నారట. ఈ మూవీలో రహమాన్ పోషించబోయే పాత్ర సినిమా డైరెక్టర్ గా కనిపించనుంది. ప్రభుదేవా హీరోగా నటించిన తొలి చిత్రం 'కాదలన్'కు స్వరకల్పన చేసి, ఆ సినిమాను ఘనవిజయం సాధించేలా చేయడంలో రహమాన్ బాణీల పాత్ర ఎంతో ఉంది.

ఇప్పుడు అదే ప్రభుదేవాతో కలసి రహమాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోవడం విశేషంగా మారింది. గతంలోనూ కొందరు సంగీత దర్శకులు నటనలో రాణించారు. అలాంటి వారిలో గంగై అమరన్, విజయ్ ఆంటోనీ, రహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్, హిమేశ్ రేషమ్మియా, సంతోష్ నారాయణన్ ముందుగా కనిపిస్తారు... వీరిలో హీరోగా మంచి విజయం సాధించిన క్రెడిట్ విజయ్ ఆంటోనికే దక్కుతుంది. 'మూన్ వాక్'లో రహమాన్ ఏమీ హీరో పాత్ర పోషించడం లేదు. అయితే కథను నడిపించే అసలైన రోల్ రహమాన్ దే అని ఇన్ సైడ్ టాక్.
ఇప్పటి దాకా యాక్టర్స్ గా అలరించిన మ్యూజిక్ డైరెక్టర్స్ కు ప్రపంచ వ్యాప్తంగా రహమాన్ కు ఉన్న క్రేజ్ లేదు. అందువల్ల రహమాన్ తొలిసారి స్క్రీన్ పై ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించబోవడం విశేషంగా మారింది. రహమాన్ బాణీలంటే చెవులు కోసుకొనేవారెందరో ఉన్నారు. అలాంటి వారికి రహమాన్ నటన ఏ తీరున కిక్కునిస్తుందో చూడాలని పలువురు సినీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారిని రహమాన్ నటన ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.