Parasakthi: తెలుగు వారిపై.. 'ప‌రాశ‌క్తి' అక్క‌సు! మండిప‌డుతున్న నెటిజ‌న్లు

ABN , Publish Date - Jan 10 , 2026 | 10:45 AM

శివ కార్తికేయ‌న్ లేటెస్ట్ ఫిలిం ప‌రాశ‌క్తి భాషా వివాదంలో చిక్కుకుంది. సినిమాపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తీవ్రంగా మండి ప‌డుతున్నారు.

Parasakthi

శివ కార్తికేయన్ ( Sivakarthikeyan), రవి మోహన్ ( Ravi Mohan), అథర్వ మురళి (Atharvaa), శ్రీలీల (Sreeleela) కలయికలో తెరకెక్కిన చిత్రం పరాశక్తి. ఆకాశమే హద్దురా వంటి మెమరబుల్ చిత్రం తర్వాత సుధా కొంగర (Sudha Kongara) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ జన నాయగన్ సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడడంతో ఈ పండుగను క్యాష్ చేసుకునేందుకు తెలుగు మినహా మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పడీ సినిమా భాషా వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మూవీపై తెగ మండి పడుతున్నారు.

విషయానికి వస్తే.. 1960 సమయంలో ప్రజలంతా హిందీ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలన్న చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు కేంద్రంగా హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ‘పరాశక్తి’ తెరకెక్కింది. హిందీ వ్యతిరేక ఉద్యమం కారణంగా కొన్నేండ్ల పాటు తమళనాట తిరుగుబాట్లు, అణిచివేతలు భారీ స్థాయిలో జరిగాయి. అంతేకాదు అక్కడ నివసిస్తున్న తెలుగు వారిని సైతం తక్కువగా చూడడమే కాకుండా గొల్టి (golti) అనే పేరుతో ఎగతాళి చేస్తూ అవమానించే వారు. కాలక్రమంలో హిందీ వ్యతిరేక ఉద్యమం చల్లబడటంతో పాటు గొల్టి (golti) పదం కూడా కనుమరుగయింది.

Parasakthi

తాజాగా ఆ కథతోనే వచ్చిన పరాశక్తి సినిమాకు సెన్సార్ బోర్టు 25 కట్స్ ను సూచిస్తూ సర్టిఫికెట్ ఇచ్చింది. అందులో 17వ నంబర్లో నాడు తెలుగు వారిని అవమానిస్తూ సంబోధించిన గొల్టి పదం ఉండటంతో… దాన్ని మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు తెలిపింది. దాంతో దర్శకనిర్మాతలు ఆ పదాన్ని తమిళంలో మ్యూట్ చేయగా తెలుగులో మాత్రం జై తెలుగు అని మార్చినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పడు బయటకు రావడంతో తెలుగు వారు మండిపడుతున్నారు. ఎప్పుడో అందరూ మర్చిపోయిన పదాన్ని వాడాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ సీరియస్ అవుతున్నారు. దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) తెలుగు మహిళ అయి ఉండి ఆ పదం ఎలా వాడారని… అందుకు హీరోలు శివ కార్తికేయన్, రవి మోహన్ ఎలా అంగీకరించారంటూ ఫైర్ అవుతున్నారు.

తెలుగు సినిమాల రిలీజ్ల విషయంలో తమిళనాట సరైన ప్రాధాన్యత లభించటం లేదని ఇప్పటికే తీవ్రమైన విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ తమిళ హీరోలు తమ సినిమాలను మాత్రం తెలుగు నాట ఎలాంటి సమస్యలు లేకుండా రిలీజ్ చేస్తూ… చక్కటి వసూళ్ళతో స్టార్ స్టేటస్ సైతం దక్కించుకుంటూ వస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు తెలుగు వారిపై ఇలా అక్కసు వెళ్లగక్కుతారా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవాయిడ్, బాయ్కాట్ పరాశక్తి అంటూ ట్రెండింగ్ కూడా చేస్తున్నారు. తెలుగు రిలీజ్ సమయానికి ఈ అంశంపై స్పందన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయమై సినిమాకు దర్శకత్వం వహించిన సుధాకొంగర, నటించిన హీరోలు శివకార్తికేయన్, జయం రవి ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Jan 10 , 2026 | 11:56 AM