జనం ముందుకు అనుపమా డబ్బింగ్ మూవీ!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:20 PM
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అనుపమా పరమేశ్వరన్ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా తెలుగులో థియేటర్లలో విడుదల కాబోతోంది. సెన్సార్ ఇబ్బందులను అధిగమించి విడుదలైన ఈ సినిమాకు పెద్దంత ఆదరణ అప్పుడు లభించలేదు.
అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన మలయాళ చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (Janaki V vs State of Kerala) గత యేడాది విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు బోలెడంత డ్రామా నడిచింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా నిర్మాతలను చాలా ఇబ్బందులకు గురిచేశారని, పలు కట్స్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అసలు కీలక పాత్రధారిణి జానకి పేరునే తొలగించమన్నారని చెప్పుకున్నారు. చివరకు రకరకాల చర్చల అనంతరం ఈ సినిమా పేరును 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చారు. అలానే కోర్టులో కీలక వాదనలు జరిగే సమయంలో పలు మార్లు వచ్చిన జానకి అనే పేరును కొన్ని చోట్ల మ్యూట్ చేశారు. విశేషం ఏమంటే... ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రను బీజేపీ ఎంపి, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ (Suresh Gopi) పోషించారు. అయినా ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు తప్పలేదు. అప్పట్లో పాన్ ఇండియాగా ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించిన మేకర్స్... చివరకు మలయాళంలో మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ఈ సినిమాను తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. అయితే కాస్తంత ఆలస్యంగా జీ 5లో తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్ట్ 22 నుండి స్ట్రీమింగ్ అయ్యింది.
చిత్రమేమంటే... అప్పుడు ఓటీటీలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో తెలుగు భాషలో విడుదల అవుతోంది. మార్చి 13న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాపై జరిగిన వివాదం కారణంగా ఓపెనింగ్స్ అయినా భారీగా వస్తాయని అప్పట్లో ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ సినిమాలో పస లేదని, అందుకే ఆశించిన స్థాయిలో ఆడలేదని తేల్చేశాయి. కానీ ఇప్పుడు చిత్రంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం ఓ రకంగా సాహసమే. అయితే ఇలా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సినిమాలు థియేటర్లలో విడుదల కావడం కొత్తేమీ కాదు... కరోనా సమయంలో వచ్చిన నాని, సుధీర్ బాబు మూవీ 'వి' మొదట్లో ఓటీటీలో విడుదలై, ఆ తర్వాత థియేటర్లలో ప్రదర్శితమైంది. అలానే చైతు జొన్నలగడ్డ 'కృష్ణ అండ్ హిజ్ లీలా' కూడా మొదట ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి, ఆ తర్వాత వేరే పేరుతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అలానే రొమాంటిక్ థ్రిల్లర్ 'ఎవోల్' కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయిన తర్వాత థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ కోవలోనే 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కూడా చేరబోతోంది.