మ్యూజిక్ డైరెక్టర్స్ : ఇద్దరి మధ్య పోటీ.. ఈ రెండు చిత్రాలే కారణం 

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:52 PM

సౌత్ స్టార్స్ తడాఖాతో నార్త్ స్టార్స్ షేకవుతున్నారు. మ్యూజిక్ ఫీల్డ్ లోనూ దక్షిణాది సంగీత దర్శకులదే హవా. ప్రస్తుతం ఇద్దరు తమిళ తంబీలు ఆల్ ఇండియా లెవెల్లో సరిగమలతో సందడి చేస్తున్నారు. వారిద్దరి మధ్యే పోటీ అని అంటున్నారు. మరి ఆ ఇద్దరి పదనిసల పవర్ ఎంతో చూద్దాం.

అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సాయి అభ్యంకర్ ఇద్దరూ తమిళనాడులో జన్మించిన వారే. ఇద్దరి మ్యూజిక్ ఇప్పుడు సంగీతప్రియులను ఆకట్టుకుంటూ సాగుతోంది. వయసులో అనిరుధ్ పెద్ద. ప్రస్తుతం అనిరుధ్ వయసు 35 సంవత్సరాలు కాగా, అభ్యంకర్ 21 ఏళ్ళ యువకుడు... అభ్యంకర్ (Sai Abhayankar) గత సంవత్సరమే చిత్రసీమలో అడుగు పెట్టారు. వచ్చీ రాగానే అందరినీ ఆకట్టుకుంటూ సాగుతున్నారు అభ్యంకర్. అనిరుధ్ సైతం తన 22 ఏళ్ళ ప్రాయంలోనే ధనుష్ హీరోగా రూపొందిన 'త్రీ' సినిమాలో 'వై దిస్ కొలవరి.' ఒక్క పాటతోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు... అదే తీరున గత సంవత్సరం మళయాళ చిత్రం 'బాల్టీ'తో భలేగా ఆకట్టుకున్నారు అభ్యంకర్. మొన్నటి దాకా అనిరుధ్ సినిమాకు పది కోట్ల రూపాయలు పారితోషికం పుచ్చుకొనేవారు. అభ్యంకర్ కూడా పది కోట్లు డిమాండ్ చేస్తున్నారని వినిపించింది. దీంతో అనిరుధ్, అభ్యంకర్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతానికి అనిరుధ్ ఎక్కువ సినిమాలతో పైచేయిగా సాగుతున్నారు.


ప్రస్తుతానికి అనిరుధ్ పైచేయి...


అనిరుధ్ 'త్రీ'లోని "కొలవరి..." సాంగ్ తో పేరు సంపాదించారు. అలాగే అభ్యంకర్ తన 'కచ్చిసేరా...' ఆల్బమ్ తో ఓ ఊపు ఊపేశారు. నిజానికి దాదాపు 50 చిత్రాలకు కంపోజ్ చేసిన అనిరుధ్ తో ఇప్పటి దాకా రెండే రెండు సినిమాలకు స్వరాలు కూర్చిన అభ్యంకర్ ను పోల్చడం సరికాదనీ పరిశీలకులు అంటున్నారు. అయితే ఇరవై ఏళ్ళు నిండగానే అనిరుధ్, అభ్యంకర్ అలరించిన తీరు ఒకేలా ఉందని, అందువల్లే ఒకరితో ఒకరిని పోలుస్తున్నారనీ మరికొందరి మాట. ఈ యేడాది అనిరుధ్ స్వరకల్పనలో "జననాయగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యాజిక్, ప్యారడైజ్, డీసీ, జైలర్ 2,అరసన్, కింగ్" వంటి సినిమాలు వెలుగు చూడనున్నాయి... తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో అనిరుధ్ బిజీగా సాగుతున్నారు. ఇక అభ్యంకర్ విషయానికి వస్తే ఆయన మ్యూజిక్ కంపోజిషన్ లో "కురుప్పు, బెంజ్, మార్షల్" అనే తమిళ చిత్రాలు ఈ యేడాదే వెలుగు చూడనున్నాయి...

అల్లు అర్జున్ వల్లే పోటీ...

వాస్తవానికి అనిరుధ్ చేతిలో ఉన్నన్ని ప్రాజెక్ట్స్ అభ్యంకర్ దగ్గర లేవు. అయినా వారిద్దరినీ పోల్చడానికి తెలుగు సినిమాలే కారణమని చెప్పక తప్పదు. అందునా ఆ సినిమాలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రాలు కావడం మరింత విశేషం!. బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రానికి అభ్యంకర్ స్వరకల్పన చేస్తున్నారు. ఈ మూవీతో తెలుగు చిత్రసీమలో అడుగు పెడుతున్నారు అభ్యంకర్. ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ రూపొందించబోయే చిత్రానికి అనిరుధ్ స్వరకల్పన చేయబోతున్నారు. ఈ చిత్రానికే అనిరుధ్ ఇరవై ఐదు కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారని టాక్. అల్లు అర్జున్ మూవీస్ తోనే అనిరుధ్, అభ్యంకర్ ఇద్దరూ భారీ మొత్తాలు పట్టేస్తున్నారు... ఈ రెండు సినిమాల మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ లోగా అనిరుధ్, అభ్యంకర్ సినిమాల సంగీతం ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
 



Updated Date - Mar 17 , 2026 | 05:12 PM