Anil Ravipudi: విజయ్ కి నచ్చడమే గొప్ప..

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:56 PM

ప్రస్తుతం అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో అందరి చూపు జన నాయగన్ (Jana Nayagan) మీదనే ఉంది. ఎన్నో సమస్యలను దాటుకొని ఈ సినిమా జులై 23 న ప్రేక్షకుల ముందకు రానుంది.

Anil Ravipudi

ప్రస్తుతం అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో అందరి చూపు జన నాయగన్ (Jana Nayagan) మీదనే ఉంది. ఎన్నో సమస్యలను దాటుకొని ఈ సినిమా జులై 23 న ప్రేక్షకుల ముందకు రానుంది. దళపతి విజయ్ (Vijay) చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడే.. నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరి రీమేక్ అని టాక్ నడించింది. ట్రైలర్ చూశాక అది కన్ఫర్మ్ అయ్యింది. కచ్చితంగా ఈ సినిమా బాలయ్య సినిమాకు రీమేక్ అని ఫ్యాన్స్ తేల్చేశారు. అయితే అది రీమేక్ కాదని, దర్శకుడు హెచ్.వినోద్ ఒరిజినల్ కథలోని మెయిన్ పాయింట్‌తో పాటు కొన్ని కీలకమైన ఎపిసోడ్లను తీసుకుని విజయ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారని చెప్పుకొచ్చారు.


తాజాగా జన నాయగన్ ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పాల్గొనడం ఆశ్చర్యంగా ఉంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ రీమేక్ రైట్స్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన సినిమాను విజయ్ మెచ్చుకోవడమే కాకుండా.. ఆ సినిమాలో కొన్ని సీన్స్ ని వాడుకుంటాను అని చెప్పడం చలా గర్వంగా ఉందని తెలిపాడు. ది గోట్ షూటింగ్ సమయంలో విజయ్ తనను ప్రత్యేకంగా కారవాన్‌కు పిలిపించి మాట్లాడారని, ఆ సమయంలో విజయ్ తనతో 'నేను భగవంత్ కేసరి చూశాను, అందులోని కొన్ని ఎలిమెంట్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి' అని ప్రశంసించడంతో తాను చాలా ఎగ్జైట్ అయ్యానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.


ఇక ఆ తర్వాత కొన్ని నెలలకు కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వచ్చి, భగవంత్ కేసరిలోని కొన్ని సీన్లతో విజయ్ సినిమా చేయాలనుకుంటున్నారని, రీమేక్ రైట్స్ కోసం సంప్రదించారని చెప్పడంతో ఆలస్యం చేయకుండా తన నిర్మాత సాహుకు ఫోన్ చేసి 'విజయ్ గారు ఏది అడిగితే అది ఇచ్చేయండి, ముందు ఓకే చెప్పండి ఆ తరువాత డీల్ గురించి మాట్లాడదాం' అని చెప్పాడట. తన సినిమా నుంచి పావు భాగం తీసుకున్నా, సగం తీసుకున్నా పర్లేదు కానీ.. దళపతి విజయ్ లాంటి స్టార్‌కు తన సినిమా నచ్చి అందులో సీన్లు తీసుకోవడమే తనకు లభించిన అతిపెద్ద గౌరవమని అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యాడు. మరి ఈ సినిమా ఫ్యాన్స్ కి నచ్చి విజయ్ కి చివరి కానుకను విజయంతో అందిస్తారో లేదో చూడాలి.

Updated Date - Jul 22 , 2026 | 04:56 PM