Allu Arjun: బన్నీమూవీలో.. టైగర్ ష్రాఫ్
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:09 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తోన్న మూవీపై రోజుకో న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఉత్తరాదికి చెందిన పలువురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారని టాక్. ఇప్పుడు ఓ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బాలీవుడ్ స్టార్ కూడా నటించనున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ (Allu Arjun) తో అట్లీ కుమార్ (Atlee Kumar) తెరకెక్కిస్తోన్న భారీ చిత్రంలో దీపికా పదుకొణే (Deepika Padukone) ఓ నాయికగా ఎన్నికయింది. తరువాత జాన్వీ కపూర్ (Janhvi Kapoor), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వంటి వారు సైతం ఇందులో నటిస్తున్నట్టు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటించనున్నారని విశేషంగా టముకు సాగుతోంది. ఇదే జరిగితే బన్నీ- అట్లీ మూవీ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. బన్నీ, టైగర్ ఇద్దరూ యాక్షన్ తో పాటు డాన్సుల్లోనూ కూడా అదరహో అనిపిస్తారని అందరికీ తెలుసు. అందువల్ల బన్నీ, టైగర్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ తీరే వేరుగా ఉంటుందని బాలీవుడ్ బాబులు సైతం అంటున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. అయితే ఇందులో సౌత్ స్టార్స్ కన్నా మిన్నగా నార్త్ స్టార్స్ ను దింపుతున్నారు అట్లీ. అదే నేడు చెన్నైలో చర్చనీయాంశమయిందని తెలుస్తోంది.
ఇప్పటిదాకా తమిళనాట వెయ్యి కోట్లు చూసిన స్టార్ హీరో కానీ, డైరెక్టర్ కానీ లేరు. అయితే అట్లీ కుమార్ మాత్రం అందుకు మినహాయింపు. ఆయన దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన 'జవాన్' (Jawan) సినిమా వెయ్యి కోట్లకు పైగా పోగేసిన సంగతి తెలిసిందే. అలా తమిళ స్టార్ డైరెక్టర్స్ లో అట్లీ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొనేలా చేసుకున్నారు. అయితే 'జవాన్' సినిమా పూర్తిగా బాలీవుడ్ చిత్రం కావడం, అందులో షారుఖ్ ఖాన్ లాంటి టాప్ స్టార్ నటించడం వల్ల వెయ్యి కోట్లు కొల్లగొట్టినా,ఆ క్రెడిట్ కోలీవుడ్ కు చెందడం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ రూపొందిస్తోన్న సినిమాతో ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా పోగేస్తారని సౌత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ మూవీలోనూ అల్లు అర్జున్ మినహా అందరినీ బాలీవుడ్ స్టార్స్ ను అట్లీ దింపుతూ ఉండడంతో కోలీవుడ్ లో కొందరు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనీ సమాచారం. ఆ సినిమాలో ఎవరు నటించినా, ఆ హిట్ క్రెడిట్ హీరో బన్నీకి, డైరెక్టర్ అట్లీకే దక్కుతుందనీ కొందరు అంటున్నారు.
ఇక బన్నీ-అట్లీ మూవీలో నిజంగానే టైగర్ ష్రాఫ్ నటిస్తే తప్పకుండా అది విశేషమే! ఇద్దరు డాన్స్ స్టార్స్ నటిస్తూండడం వల్ల తప్పకుండా సినిమాలో వారిద్దరి కాంబోలో ఓ పాటను చిత్రీకరిస్తారనీ ఫ్యాన్స్ అప్పుడే ఊహాగానాలు చేస్తున్నారు. ఆ పాట ఎలా ఉంటుంది?. 'ట్రిపుల్ ఆర్'లోని 'నాటు నాటు...' రేంజ్ లో ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇతను కూడా బాలీవుడ్ టెక్నీషియన్ కావడం గమనార్హం! పాట కూడా అటు నార్త్, ఇటు సౌత్ - అన్ని వర్గాల వారినీ అలరించే రీతిలో ఉంటుందని ఇప్పుడే అంచనా వేస్తున్నారు బాలీవుడ్ బాబులు. ఈ మూవీలో ఎక్కువగా ఉత్తరాది స్టార్స్ నటిస్తూ ఉండడంతో ఈ చిత్రానికి తమిళనాట పెద్దగా బజ్ ఉండదనీ కొందరి మాట. అలా అయినా తెలుగు, కన్నడ, మళయాళ సీమల్లో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక 'పుష్ప' సిరీస్ తో నార్త్ లోనూ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అట్లీ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారని వినికిడి. అందువల్లే టైగర్ ష్రాఫ్ ను కూడా ఎంచుకున్నారనీ అంటున్నారు. వీటిలో నిజానిజాలేపాటివో కానీ, బన్నీ, టైగర్ కలసి నర్తిస్తే చూడటానికి సినీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. మరి అట్లీ కుమార్ వారిద్దరితో ఏ తీరున సాగుతారో చూడాలి.