AA23: సంక్రాంతి సర్‌ప్రైజ్... బన్నీ ఫ్యాన్స్ లో జోష్
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:01 PM
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆ భారీ క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్‌కు తెరపడింది.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆ భారీ క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. సంక్రాంతి పండగ వేళ మైత్రీ మూవీ మేకర్స్ ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి #AA23 ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. ఈ కాంబో అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటేనే ఇది ఒక సాధారణ సినిమా కాదని, ఇండియన్ స్క్రీన్‌పై ఒక సరికొత్త రికార్డును సృష్టించబోతోందని స్పష్టమవుతోంది.
లోకేష్ కనగరాజ్ అంటేనే ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన గత సినిమాల్లాగే ఈ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీడియోలో కనిపించిన డేగలు, తోడేళ్ళ గుంపు వంటి అంశాలను చూస్తుంటే, ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగమేనా అనే చర్చ మొదలైంది. ఒకవైపు ఆకాశంలో డేగ, మరోవైపు భూమిపై క్రూరమైన తోడేళ్ళ సమూహం.. వీటి మధ్యలో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గుర్రంపై కూర్చున్న స్టైలిష్ షాట్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంతేకాకుండా, ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కేవలం 52 సెకండ్లు ఉన్న గ్లింప్స్‌లోనే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ ప్రకంపనలు సృష్టించారు.
పుష్ప-2 ఘనవిజయం తర్వాత అల్లు అర్జున్ ప్రతి అడుగును ఎంతో పక్కాగా వేస్తున్నారు. తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆయన చూపిస్తున్న విభిన్నత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఒక భారీ పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సెట్స్‌పై ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు లోకేష్‌తో సినిమా అనౌన్స్ చేయడం గమనార్హం. వరుసగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం సౌత్ లేదా నార్త్ ఇండియా మాత్రమే కాకుండా, గ్లోబల్ మార్కెట్‌ను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఆయన ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. #LK07 హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా 2026లో షూటింగ్ ప్రారంభం కానుంది. మొత్తానికి లోకేష్ కనగరాజ్ డార్క్ అండ్ వైలెంట్ వరల్డ్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడం సినీ ప్రేమికులకు పూనకాలు తెప్పిస్తోంది. విక్రమ్, రోలెక్స్ వంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ల సరసన అల్లు అర్జున్ క్యారెక్టర్ కూడా ఉంటుందా..? లేక ఇదొక ఫ్రెష్ స్టోరీనా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబో ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.