ఐశ్వర్య దర్శకత్వంలో ‘టెక్స్‌లా’ ప్రారంభం
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:23 AM
ప్రముఖ నిర్మాణ సంస్థ కేఆర్‌జీ గ్రూపు పతాకంపై కన్నర్ రవి నిర్మాణ సారథ్యంలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘టెక్స్‌లా’ పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ కేఆర్‌జీ గ్రూపు పతాకంపై కన్నర్ రవి నిర్మాణ సారథ్యంలో ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో ‘టెక్స్‌లా’ (Texsla movie) పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో జై, మలయాళ నటుడు సూరజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం శుక్రవారం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత ఆర్‌బీ చౌదరి, సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లత, దర్శకుడు, ఎన్‌ఎంకే కన్వీనర్ సీమాన్, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు జీకేఎం తమిళ్ కుమరన్, అమ్మా క్రియేషన్స్ అధినేత అమ్మా శివ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కోలీవుడ్ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, నటులు సముద్రఖని, ఆనంద్ రాజ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత కన్నన్ రవి మాట్లాడుతూ, ‘తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువకాలంలోనే రజనీకాంత్ ఫ్యామిలీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టు ఖరారు కావడానికి వెన్నుముకగా నిలిచిన పలువురు ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. మా నిర్మాణ సంస్థ ఏకకాలంలో 16 సినిమాలను నిర్మిస్తుంది. మున్ముందు మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం. చిత్ర పరిశ్రమలో అందరికంటే చిన్నవాడిని. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
ఆర్‌బీ చౌదరి మాట్లాడుతూ, ‘పరిశ్రమలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఈ పరిస్థితుల్లో ఒకేసారి 16 చిత్రాలు నిర్మించడం అంటే పెద్ద సాహసమే. కన్నన్ రవికి శుభాకాంక్షలు తెలిపారు. సీమాన్ మాట్లాడుతూ, ‘చిత్రపరిశ్రమ బాగానే ఉందని, కానీ, ఎంచుకునే కథలే చిత్ర విజయానికి సోపానాలన్నారు.
దర్శకుడు బాలా మాట్లాడుతూ, ‘ఒక చిత్రం తీస్తే 20 కార్మిక కుటుంబాల్లో పొయ్యి వెలుగుతుందని నిర్మాత కలైపులి థాను అంటుంటారని, కన్నన్ రవి కూడా వరుస చిత్రాలు నిర్మించి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలి’ అని కోరారు. ఈ కార్యక్రమానికి ‘టెక్స్‌లా’ చిత్రంలో నటించనున్న నటీనటులంతా హాజరయ్యారు.