సీఎం విజయ్ క్రేజ్.. దెబ్బకు మారిన ‘జన నాయగన్’ బిజినెస్
ABN , Publish Date - May 12 , 2026 | 03:56 PM
విజయ్ సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చిత్రం ‘జన నాయగన్’. దళపతి చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (vijay) సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చిత్రం ‘జన నాయగన్’ (jananayagan). దళపతి చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా పూర్తయినప్పటికీ సెన్సార్ బోర్డు వద్ద ఎదురైన కొన్ని సాంకేతిక, కంటెంట్ పరమైన అడ్డంకుల వల్ల విడుదల నిరంతరం వాయిదా పడుతూ వచ్చింది. ఈ జాప్యం సినిమా డిజిటల్ బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు చెల్లాచెదురు కావడంతో, సినిమా భవితవ్యంపై ఒకానొక దశలో నీలినీడలు కమ్ముకున్నాయి.
తొలుత ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకున్నప్పటికీ, విడుదల ఆలస్యం కావడంతో ఆ డీల్ రద్దయింది. ఆ తర్వాత జీ 5 రేసులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఎప్పుడైతే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో, అప్పుడు ఈ ప్రాజెక్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఒక రాష్ట్ర సీఎం నటిస్తున్న చివరి సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా దీనికి వచ్చే ఆదరణను దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ప్రైమ్ మళ్లీ KVN ప్రొడక్షన్స్ తో చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ (H Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పక్కా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రవేశానికి తగ్గట్టుగానే ఇందులో పవర్ ఫుల్ డైలాగులు, సామాజిక అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, మలయాళ బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో మెరవనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.
సినిమా విడుదల ఆలస్యం అవుతున్న తరుణంలో, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు నెట్టింట లీక్ అవ్వడం చిత్ర యూనిట్‌ను కలవరానికి గురిచేసింది. దీనిపై రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. అయితే, మేకర్స్ ఈ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటూ, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, తన అభిమానుల కోసం ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ పుట్టినరోజైన జూన్ 22న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. సెన్సార్ లైన్ క్లియర్ అయిన వెంటనే, అఫీషియల్ ఓటీటీ పార్ట్నర్, రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక నటుడు ముఖ్యమంత్రి అయ్యాక విడుదలవుతున్న సినిమా కావడంతో ఇది భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక అరుదైన రికార్డుగా నిలవనుంది.