7జీ బృందావ‌న్ కాల‌నీ2.. షూటింగ్ మళ్లీ ప్రారంభం

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:24 PM

2004వ సంవత్సరంలో వచ్చిన 7జీ బృందావన్ కాలనీ త‌మిళ‌, తెలుగులో భాష‌ల్లో భారీ విజయం నమోదు చేసింది.

Anaswara Rajan

సెల్వరాఘవన్ (Selvaraghavan) దర్శకత్వంలో రవికృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) నటించిన చిత్రం 7జీ రెయిన్‌బో కాలనీ (7G Rainbow Colony). 2004వ సంవత్సరంలో వచ్చిన చిత్రం తెలుగులో 7జీ బృందావన్ కాలనీ (7G Brindavan Colony) పేరుతో విడుదలై త‌మిళ‌, తెలుగులో భాష‌ల్లో భారీ విజయం నమోదు చేసింది. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించగా, ఏఎం రత్నం (A.M. Rathnam) నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 200 రోజుల వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఆడిన ఈ చిత్రం క‌ల్ట్ క్లాసిక్ జాబితాలో చేరింది. ఆ త‌ర్వాత రవి కృష్ణ‌, సోనియా వేర్వేరు సినిమాల్లో న‌టించి మంచి పేర్లు తెచ్చుకున్నారు.

అయితే.. ఈ చిత్రం వ‌చ్చి దాదాపు రెండు ద‌శాబ్దాలు గ‌డిచిన‌ప్ప‌టికీ ఈ మూవీ పాటలు ఇప్ప‌టికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటాయి. కాగా ఇన్నాళ్ల‌కు ఈ మూవీకి సీక్వెల్‌ను తమిళం, తెలుగు అని రెండు భాషల్లో తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. గ్యాప్ త‌ర్వాత ర‌వి కృష్ణ హీరోగా రీ ఎంట్రీ ఇస్తుండ‌గా సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ట్ చేస్తున్నాడు. మ‌ల‌యాళ బ్యూటీ అనస్వ‌ర‌ రాజ‌న్ (Anaswara Rajan) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇదిలాఉంటే.. రెండేండ్ల క్రిత‌మే ప్రారంభించిన సినిమా ఇప్ప‌టికే షూటింగ్ 60 శాతం పూర్తయింది. అయితే ఆ తరువాత హీరోయిన్ కాల్షీట్లు లేక ఆరేడు నెల‌లుగా నిలిచిపోయింది.

7G Brindavan Colony

ఈ క్ర‌మంలో అన‌స్వ‌ర క్ర‌మంగా ద‌క్ష‌ణాదిలో వ‌రుస చిత్రాల‌తో బిజీ అవ‌డం, ఛాంఫియ‌న్‌, విత్ ల‌వ్ సినిమాలు రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల అన‌స్వ‌ర‌కు కాస్త టైమ్‌ ల‌భించ‌డంతో 7జీ రెయిన్‌బో కాలనీ బ్యాల‌న్స్ షూటింగ్‌కు కాల్షీట్లు కేటాయించింది. దీంతో ప్రస్తుతం మిగిలిన షూటింగ్ మంగళవారం పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభమైన‌ట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి జూలై, ఆగ‌స్టులో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:49 PM