నాలుగు దశాబ్దాల తర్వాత.. మళ్లీ రజనీకాంత్‌తో హృతిక్‌!

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:05 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ‘జైలర్ 2’ లో నటించే బాలీవుడ్‌ స్టార్‌ ఎవరో తెలిసిపోయింది.

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్ 2’ (Jailer 2) లో నటించే బాలీవుడ్‌ స్టార్‌ ఎవరో తెలిసిపోయింది. చాలా రోజులుగా షారుక్‌ ఖాన్‌ ఆ సినిమాలో నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయనకు బదులు హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) నటించనున్నారని సమాచారం.

షారుక్‌ మొదట రజనీ చిత్రంలో నటించడానికి ఉత్సాహం చూపించినా తన సొంత చిత్రం ‘కింగ్‌’తో తన కుమార్తె సుహానా ఖాన్‌ నటిగా ఎంట్రీ ఇస్తుండడంతో ఆయన దృష్టంతా ఆ సినిమా మీదే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తను ‘జైలర్‌ 2’లో నటించలేనని, భవిష్యత్‌లో తప్పకుండా రజనీకాంత్‌ మరే చిత్రంలోనైనా నటిస్తానని షారుక్‌ ఖాన్‌ చెప్పడంతో రజనీ సరేనన్నారని సమాచారం.

ఇప్పుడు ఆయనకు బదులు హృతిక్‌ రోషన్‌ ‘జైలర్‌ 2’లో నటించనున్నారు. 1986లో వచ్చిన ‘భగవాన్‌ దాదా’ (Bhagwaan Dada) చిత్రంలో బాలనటుడిగా రజనీకాంత్‌ కొడుకు పాత్ర పోషించిన హృతిక్‌ నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆయనతో కలసి నటిస్తుండడం విశేషం. ఈ నెల 22న చెన్నై వచ్చి రెండు రోజుల పాటు జరిగే ‘జైలర్‌ 2’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు హృతిక్‌.

రజనీకాంత్‌ పోషిస్తున్న టైగర్‌ ముత్తు వేల్‌ పాండ్యన్‌కు ఓ సందర్భంలో అండగా నిలిచే పాత్రను హృతిక్‌ పోషించనున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్‌ 2’ చిత్రంలో రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, ఎస్‌.జె. సూర్య తదితరులు నటిస్తున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 06:05 AM