హ‌మ్మ‌య్యా.. 12 ఏండ్ల త‌ర్వాత‌ విక్ర‌మ్ సినిమా రిలీజ్‌కు మోక్షం

ABN , Publish Date - May 01 , 2026 | 08:42 AM

విక్రమ్, రీతూవర్మ నటించిన ధ్రువనక్షత్తిరం సినిమాను జూన్ నెల 15వ తేదీలోగా విడుదల చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Dhruva Nakshathram

గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శక నిర్మాణంలో విక్రమ్ (Vikram), రీతూవర్మ (Ritu Varma), సిమ్రన్, డీడీ, పార్తిబన్ తదితరులు నటించిన ధ్రువనక్షత్తిరం (Dhruva Natchathiram) (తెలుగులో ధ్రువనక్షత్రం) సినిమాను జూన్ నెల 15వ తేదీలోగా విడుదల చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు (Madras High Court) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లోనే ప్రారంభ‌మైన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని 2017-18లోనే విడుదలకు సిద్ద‌మైంది. అయితే చివ‌రి నిమిషంలో ఈ చిత్రం ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేక పోయింది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి సెంథిల్ కుమార్ విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ధ్రువనక్షత్తిరం' చిత్రాన్ని జూన్ 15వ తేదీలోగా విడుదల చేయొచ్చని తెలిపారు. అయితే.. ఈ చిత్ర ఆర్థిక లావాదేవీల నిర్వహణలను పర్య వేక్షించేందుకు కొండాడువోం ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచి, మూవీ కలెక్షన్లన్నీ అందులో డిపాజిట్ చేసి, వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.

చిత్ర నిర్మాత, దర్శకుడైన గౌతమ్ మీనన్.. ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని ఆర్ధిక చెల్లింపులు చేయాల్సి ఉందని, థియేటర్ యజమాన్యాలతో మాట్లాడాల్సి ఉందని, అందువల్ల జూన్ 15వ తేదీలోగా చిత్రాన్ని విడుదల చేయలేని పక్షంలో మరింత సమయం కోరుతూ కోర్టును ఆశ్రయించవచ్చని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 01 , 2026 | 09:07 AM