ధనుష్‌కు జోడీగా 'కాంతార' బ్యూటీ
ABN , Publish Date - Mar 12 , 2026 | 10:11 AM
ఇటీవల భాషా భేదం లేకుండా వరుస చిత్రాలతో దూసుకు పోతున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్.
ఇటీవల భాషా భేదం లేకుండా వరుస చిత్రాలతో దూసుకు పోతున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush). గతేడాది తమిళంలో రెండు తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో సినిమా చొప్పున ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ధనుష్ ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే.. పోర్ తొళిల్ ఫేమ్ విఘ్నేష్ రాజా (Vignesh Raja) దర్శకత్వంలో కర (Kara) అనే చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన ఇప్పుడు 'అమరన్' దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండడం విశేషం.
ఈ చిత్రం ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. 'లబ్బర్ పండు' ఫేం తమిళరసన్ పచ్చముత్తు దర్శ కత్వంలో తన 56వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ధనుష్‌కు జోడీగా 'ఏస్', 'మదరాసి', 'కాంతార' తదితర చిత్రాల్లో కథానాయికగా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ను ఖరారు చేసినట్లు సమాచారం. 'ఉరియడి' విజయకుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ధనుష్ నటిస్తున్న ఇళయ రాజా (Ilaiyaraaja), మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్‌లు సెట్స్‌పై ఉన్నాయి. మరోసారి తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం, హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ సినిమా కూడా చర్చల దశలో ఉన్నట్లు వినికిడి. ఇలా ధనుష్ జయపజయాలు, భాషా భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతూ తన తోటి నటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇలా వేగంగా సినిమాలు చేస్తూ మోహన్ లాల్, మమ్ముట్టిలను మించి పోయేలా ఉన్నాడు.