హనీ రోజ్‌కు చేదు అనుభవం...
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:41 PM
నటి హనీ రోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెతో సెల్ఫీ దిగే నెపంతో కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు.
సినిమాల్లో నటించడంతో వచ్చే క్రేజ్‌ను మరో రకంగానూ క్యాష్ చేసుకోవడానికి హీరోయిన్లు వెనుకాడటం లేదు. అడగాలే కానీ షోరూమ్స్ ఓపెనింగ్‌కు, జ్యువెలరీ ప్రారంభోత్సవాలకు సై అంటున్నారు. అయితే... అక్కడకు వీరు వెళ్ళినప్పుడు నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సదరు హీరోయిన్లు చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ మధ్య కాలంలో అలా కొంతమంది హీరోయిన్లు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలోనూ, అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించడంతోనూ ఇబ్బందులు పడ్డారు. అయినా వీటి నిర్వాహకులలో ఎలాంటి మార్పు రావడం లేదు. హీరోయిన్లు కూడా ఒకటి రెండు రోజుల్లో వీటిని మర్చిపోయి... యథావిధిగా ఇలాంటి ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు.
'ఆలయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్... కొన్నేళ్ళ తర్వాత 'వీరసింహారెడ్డి'లో బాలకృష్ణ సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు తెలుగులో వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ చిత్రంగా ఆమె మరే తెలుగు సినిమాలో చేయలేదు. తాజాగా ఈ మలయాళ నటికి కేరళలోని కోజికోడ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్‌ను ప్రారంభించడానికి వెళ్ళిన సమయంలో అక్కడి అభిమానులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. సెల్ఫీ దిగాలనే వంకతో ఆమె నడుముపై చేయి వేసి అసభ్యంగా వ్యవహరించారు. బహిరంగ ప్రదేశం కావడం, జనం మధ్యలో ఉండటంతో హనీ రోజ్ మౌనంగా అక్కడ నుండి నిష్క్రమించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.