ఆ దర్శకుడు ముప్పు తిప్పలు పెట్టాడు.. జ‌న్మ‌లో అత‌నితో సినిమా చేయ‌ను

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:33 PM

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని కాంబినేషన్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతాయి. సరిగ్గా ఇలాంటి చర్చకే ఇప్పుడు తెరలేపింది నటి ఆండ్రియా జెర్మియా

Andrea Jeremiah

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని కాంబినేషన్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతాయి. సరిగ్గా ఇలాంటి చర్చకే ఇప్పుడు తెరలేపింది నటి ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah). సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu) సినిమా సీక్వెల్ గురించి ఆమె మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..!

నిజానికి యుగానికి ఒక్కడు అనేది ఒక సినిమా మాత్రమే కాదు.. అదొక అడ్వెంచర్. ఈ చిత్రం విషయంలో దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan ) విజన్ ఎలా ఉంటుందో అందరికీ నిరూపించాడు. ఒక విధంగా అది ఒక అద్భుతం అని చెప్పాలి. కానీ ఆ అద్భుతం వెనుక నటీనటులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సుమారు 200 రోజులకు పైగా షూటింగ్.. అదీ అడవుల్లో, ఎడారుల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల మధ్య చిత్రీకరణ సాగింది.

ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కార్తీ (Karthi) కి తెలుగులో ఒక మార్కెట్ ఏర్పడడానికి ఈ సినిమానే పునాది వేసింది. అలాగే ఆండ్రియాకు కూడా హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సెల్వరాఘవన్ కూడా యుగానికి ఒక్కడు-2 కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్. ఈసారి కార్తీ ప్లేస్‌లో తన తమ్ముడు ధనుష్ (Dhanush)ను హీరోగా అనుకున్నారు. ఈ నేప‌థ్యంలో 2021లోనే ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. కానీ.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఇదే క్రమంలో సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఆండ్రియాను సంప్రదించగా.. ఆమె ఇచ్చిన రియాక్షన్ సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నేను ఆ సీక్వెల్‌లో నటించను.. అది జరిగే పనే కాదు అని ఆండ్రియా తేల్చి చెప్పేసింది. దానికి ఆమె చెప్పిన కారణాలు కూడా చాలా ఘాటుగా ఉన్నాయి. సెల్వరాఘవన్ షూటింగ్ స్టైల్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన చెప్పే టైమింగ్‌కు, అక్కడ చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. గ‌తంలో షూటింగ్ సమయంలో నేను పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మళ్ళీ సెల్వరాఘవన్‌తో సినిమా చేయడం నా వల్ల కాదు అంటూ ఓపెన్‌గా మాట్లాడేసింది.

సినిమా హిట్ అవ్వడం వల్ల అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే అయినా, షూటింగ్ సమయంలో అనుభవించిన స్ట్రగుల్‌ మాత్రం మర్చిపోలేనని ఆమె మాటల్లో అర్థమవుతోంది. ఒక పక్క సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆతృతగా వెయిట్ చేస్తుంటే, హీరోయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఏదేమైనా ఒక హిట్ సినిమా వెనుక ఉండే కష్టనష్టాలు ఇలా బయట పడటం నిజంగా కొసమెరుపే.

ఇదిలాఉంటే సెల్వ రాఘ‌వ‌న్ చాలా గ్యాప్ త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టి 7జీ బృందావ‌న్ కాల‌నీ మూవీ సీక్వెల్ తెర‌కెక్కిస్తుండ‌గా ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ మూవీ అనంత‌రం ధ‌నుష్‌తో యుగానికి ఒక్క‌డు 2 ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అయితే ఈ మూవీకి ఎంత‌కాద‌న్నా మ‌రో రెండు మూడేండ్లు ప‌ట్ట‌డం గ్యారంటీగా క‌నిపిస్తుంది.

ఎందుకంటే ప్ర‌స్తుతం ధ‌నుష్ కేవ‌లం త‌మిళ‌మే కాకుండా తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ చేతిలో సుమారు డ‌జ‌న్ ప్రాజెక్టుల‌తో తీరిక లేకుండా ఉన్నాడు. అందులో నాలుటైదు చిత్రాలు ఈ రెండేండ్ల‌లోనే విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ధ‌నుష్ డేట్స్ పైనే ఆధార‌ప‌డి అన్న‌తో సినిమా ఉండ‌నుంది. ఇక అప్ప‌టివ‌ర‌కు ఫ్యాన్స్‌కు ఎదురు చూసులు త‌ప్ప‌వు.

Updated Date - Apr 02 , 2026 | 04:33 PM