Cinema: వారసులను పరిచయం చేసిన నట దర్శకులు

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:38 PM

నేడు స్టార్స్ గా అలరిస్తున్న పలువురు ఇండియన్ హీరోస్ ముందుగా వారి తండ్రుల డైరెక్షన్ లో నటించారు. అదే బాటలో పయనించడానికి ధనుష్ కొడుకు అడుగులు వేస్తున్నాడు.

Actor-Director Kids as Heros

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 16 ఏళ్ళ తనయుడు యాత్ర రాజాను హీరోగా పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు. తమ 'వండర్ బార్ ఫిలిమ్స్' పతాకంపై స్వీయ దర్శకత్వంలో ధనుష్ నిర్మించే చిత్రంలోనే యాత్ర రాజా హీరోగా పరిచయం కానున్నాడు. మన దేశంలో టాప్ స్టార్స్ తనయులు వారి నటవారసులుగా తెరపై వెలిగి విజయాలను సాధించడం కొత్తేమీ కాదు. అయితే స్టార్స్ గా రాణిస్తున్న తమ తండ్రుల దర్శకత్వంలోనే పరిచయమై తరువాత తమదైన బాణీ పలికించిన వారున్నారు. అలాంటి వారిలో ముందుగా రాజ్ కపూర్ తనయులు రిషి కపూర్, రాజీవ్ కపూర్ కనిపిస్తారు. అయితే ముందుగా రిషి కపూర్ తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో 'మేరా నామ్ జోకర్'లో బాలనటునిగా కనిపించారు. ఆ తరువాత 1973లో రాజ్ కపూర్ రూపొందించిన 'బాబీ' చిత్రం ద్వారా యంగ్ హీరోగా పరిచయమయ్యారు రిషి కపూర్. అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ రిషి కపూర్ అనేక విజయవంతమైన చిత్రాలతో జనాన్ని అలరించారు.


తెలుగునాట బాలయ్య...

సౌత్ ఇండియాలో తన నటవారసులను ముందుగా తెరకు పరిచయం చేసిన ఘనత నటరత్న యన్టీఆర్ కే దక్కుతుంది. ఆయన తనయుల్లో హరికృష్ణ, బాలకృష్ణ నటులుగా రాణించారు. 1974లో బాలకృష్ణ తండ్రి యన్టీఆర్ దర్శకత్వంలో 'తాతమ్మ కల' చిత్రం ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఆ పై యన్టీఆర్ దర్శకత్వంలోనే 'దానవీరశూర కర్ణ, శ్రీమద్విరాటపర్వము, శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం' వంటి పౌరాణిక చిత్రాల్లోనూ, 'అక్బర్ సలీమ్ అనార్కలి' వంటి చారిత్రకంలోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా బాలయ్య జయకేతనం ఎగురవేస్తున్నారు. ప్రపంచంలోనే ఓ నటవారసుడు ఏకధాటిగా 50 ఏళ్ళ నుంచీ నటిస్తూనే ఉండడం అన్న అరుదైన అంశాన్ని సొంతం చేసుకున్నారు బాలయ్య. ఆయన తెరంగేట్రంతో ఎందరో టాలీవుడ్ స్టార్ హీరోస్ తమ వారసులను తెరకు పరిచయం చేయడం విశేషం!


తమిళనాట శింబు కూడా తన తండ్రి టి. రాజేందర్ దర్శకత్వం లోనే తొలుత తెరపై కనిపించారు. ఇక ఆల్ ఇండియాలో యూత్ ను విశేషంగా ఆకట్టుకున్న హృతిక్ రోషన్ సైతం తన తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వంలో 'కహో నా ప్యార్ హై.' సినిమాతో 2000 సంవత్సరంలో హీరోగా పరిచయమయ్యారు. ఆ పై తండ్రి దర్శకత్వంలోనే 'కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే తండ్రుల డైరెక్షన్ లోనే నటులుగా పరిచయమైన స్టార్ కిడ్స్ లో ఇప్పటికీ స్టార్స్ గా రాణిస్తున్నవారిలో బాలకృష్ణ, హృతిక్ రోషన్ మాత్రమే కనిపిస్తున్నారు. మహేశ్ బాబు కూడా తండ్రి కృష్ణ దర్శకత్వంలో కొన్ని చిత్రాల్లో నటించినా, ఆయన తెరపై ముందుగా వేరే సినిమాల్లో తళుక్కుమన్నారు. మరి ధనుష్ డైరెక్షన్ లోనే తెరకు పరిచయమవుతున్న ఆయన తనయుడు యాత్ర రాజా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Updated Date - Jan 31 , 2026 | 01:39 PM