Suriya: మరోసారి దాతృత్వం చాటుకున్న సూర్య.. విద్యార్థులకు ఆర్థిక సాయం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:27 PM
రీల్స్ చేస్తే జీవితం బాగుపడదని హీరో సూర్య విద్యార్థులకు సూచించారు. అగరం ఫౌండేషన్ కార్యక్రమంలో చదువు ప్రాధాన్యం, పేద విద్యార్థులకు అందించిన ఆర్థిక సాయం గురించి మాట్లాడారు.
రీల్స్ చేయడం వల్ల జీవితం బాగుపడదు. ఉన్నతస్థాయికి చేరుకోలేరని హీరో సూర్య (Suriya) హితవు పలికారు. నటుడు శివకుమార్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 47వ వార్షికోత్సవ వేడుకలు టి.నగర్‌లోని ఆగరం ఫౌండేషన్ (Agaram Foundation) కార్యాలయంలో ఆదివారం జరిగాయి. ఈ వేడుకల్లో ప్లస్ టూ పూర్తి చేసి కళాశాలలో చేరిన 25 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. అలాగే, ప్రముఖ చిత్రకారుడు జీవానందన్ (jeevanandan) కు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. 25 మంది విద్యార్థులతో పాటు అణగారిన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్న కొన్ని విద్యా సంస్థలతో కలిసి రూ.13.78 లక్షల మేరకు ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు శివకుమార్ (Sivakumar) మాట్లాడుతూ.. 1979 లో నా వందో చిత్రం 'రోసాప్పూ రవి కైక్కారి'కి గాను ఇచ్చిన రూ.25 వేల పారితోషికాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి తద్వారా వచ్చిన వడ్డీని పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తున్నాం. ఆరంభంలో విద్యార్థులకు వివిధ రకాల బహుమతులు ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత నా సొంత నిధుల నుంచి ఉపకారవేతనాలు అందించాను. 2006 నుంచి అగరం ఫౌండేషన్ నా పౌండేషన్ బాధ్యతలను స్వీకరించి, ప్రతి యేటా ఉపకారవేతనాలను, అవార్డులను అందిస్తోందన్నారు.
అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ.. 'విద్యార్థులు చదువులపై దృష్టి సారించాలి. రీల్స్ చేయడం వల్ల జీవితం బాగుపడదు. సినిమాల్లో సరిగా నటించకపోతే దర్శకుడు రీటేక్ చెబుతారు కానీ, నిజ జీవితంలో రీటేక్లుండవు. కష్టపడి చదువుకుంటేనే ఉన్నతస్థాయికి చేరుకోగలరు. చదువుల్లో వెనుకబడినపుడల్లా వన్స్ మోర్, వన్స్ మోర్ అంటూ తమను తాము ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలి' అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.