దృశ్యం 3 రీమేక్.. నో చెప్పిన వెంకటేశ్
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:19 PM
మొన్నటి వరకూ 'దృశ్యం 3' రీమేక్ చేస్తానని చెప్పిన వెంకటేశ్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఇప్పటికిప్పుడు ఈ రీమేక్ చేయలేని పరిస్థితిలో వెంకీ ఉన్నారు.
ఒకప్పుడు వరుస విజయాలతో సాగి 'విక్టరీ'ని పేరుకు ముందు నిలుపుకున్నారు వెంకటేశ్. 'సంక్రాంతికి వస్తున్నాం'తో గ్రాండ్ సక్సెస్ తరువాత ఆచితూచి అడుగులేస్తున్నారు వెంకీ. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తీసుకున్న ఓ నిర్ణయంపై చర్చ సాగుతోంది.
సక్సెస్ ఇచ్చే టేస్టే వేరు! పైకి ఎంతమంది విజయాలు వస్తే పొంగిపోము- ఓటమి ఎదురైతే కుంగిపోము అంటూ ఉంటారు. కానీ, విక్టరీతో వచ్చే కళే వేరు! ఒకప్పుడు వరుస విజయాలు చూసి 'విక్టరీ'ని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేశ్ కు సక్సెస్ ఇచ్చే కిక్ ఎలాంటిదో బాగా తెలుసు. ఆ మధ్య వరుస ఫ్లాపులు చూసిన వెంకటేశ్ గత సంవత్సరం 'సంక్రాంతికి వస్తున్నాం'తో బంపర్ హిట్ పట్టేశారు. సీనియర్ స్టార్స్ లో 300 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు వెంకటేశ్. ఆ 'సక్సెస్ సాగా'ను ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నారు వెంకటేశ్. ఈ నేపథ్యంలోనే 'దృశ్యం-3' రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ భావించినట్టు విశేషంగా వినిపిస్తోంది. మళయాళంలో రూపొందిన 'దృశ్యం' మూవీ రెండు భాగాలను తెలుగులో రీమేక్ చేస్తే వెంకటేశ్ నటించి సక్సెస్ చూశారు. మరి మూడో భాగానికి మాత్రం ససేమిరా అంటున్నారు.
రీమేక్స్ తో అనేక ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. అదే తీరున 'దృశ్యం' సిరీస్ తోనూ గ్రాండ్ సక్సెస్ కాకపోయినా, విజయాన్ని మూటకట్టుకోగలిగారు. కానీ, ఇప్పుడు 'దృశ్యం-3'లో నటించకూడదని వెంకీ నిర్ణయించు కున్నారు. 2013లో రూపొందిన మళయాళ 'దృశ్యం' మంచి విజయం సాధించింది. దానిని ఏడు నెలల వ్యవధిలో తెలుగులో రీమేక్ చేసి 2014లో రిలీజ్ చేయగా, ఇక్కడా ఆదరణ చూరగొంది. అలాగే 2021లో వచ్చిన 'దృశ్యం-2' తెలుగు రీమేక్ అదే యేడాది తొమ్మిది నెలల గ్యాప్ లో ప్రేక్షకులను పలకరించింది. ఇది కూడా అలరించింది. అయితే 'దృశ్యం-3' రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ నిర్ణయించడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం వెంకటేశ్ త్రివిక్రమ్ 'ఆదర్శకుటుంబం'లో నటిస్తున్నారు. అది కాగానే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించాల్సి ఉంది. ఆ రెండు చిత్రాలు అయ్యాకే 'దృశ్యం-3' చేసినా, అప్పటికే ఒరిజినల్ మళయాళ వర్షన్ ఓటీటీలో వచ్చి ఉంటుందని వెంకటేశ్ భావన. ఇక రీమేక్ ను ఎవరు చూస్తారని ఆయన అభిప్రాయం.
ఆ మధ్య టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మళయాళ రీమేక్స్‌లో నటించారు. అలా వచ్చిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' అంతగా అలరించలేకపోయింది. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మంచి ఓపెనింగ్స్ చూసింది. ఇప్పుడు సినీ లవర్స్ ఎక్కువగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఏప్రిల్ 2న 'దృశ్యం-3' మలయాళ చిత్రం విడుదలవుతోంది. ఈ మూవీ మరో నెల, నెలన్నరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే జూన్ లోగా 'దృశ్యం-3' మలయాళ వర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. దానిని రీమేక్ చేయాలంటే 2027 జనవరిలోనే వెంకటేశ్ కు వీలవుతుంది. ఎంత ఫాస్ట్‌గా తీసినా, అప్పటికే ఒరిజినల్ చూసిన జనం రీమేక్ ను చూడటానికి ఇష్టపడరని వెంకటేశ్ భావన. అందువల్లే 'దృశ్యం-3' రీమేక్ లో నటించనంటున్నారు వెంకీ. ఆయన నిర్ణయం సబబైనదే అంటున్నారు పరిశీలకులు. అందువల్ల 'దృశ్యం-3' మలయాళ వర్షన్ నే తెలుగులో డబ్ చేస్తారనీ వినిపిస్తోంది. ఏమవుతుందో చూడాలి!