విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ

ABN , Publish Date - Aug 07 , 2026 | 02:42 PM

బిచ్చ‌గాడు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ అంటోని, శ‌శి కాంబోలో వ‌చ్చిన మూవీ ‘వంద దేవుళ్ళు’.

vandha devullau

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలు చేసే నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) నుంచి వచ్చిన మరో ప్రత్యేకమైన చిత్రం ‘వంద దేవుళ్ళు’ (Vanda Devullu). ‘బిచ్చగాడు’ ఫేమ్ దర్శకుడు శశి (Shasi) తెరకెక్కించిన ఈ సినిమా గ‌త నెల‌లో థియేటర్లకు వ‌చ్చి ప్రేక్షకుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించ‌కుంది. కానీ స‌రై ప్ర‌చారం లేక జ‌నాల‌కు చేరువ కాలేక పోయింది. సామాజిక అంశాన్ని కుటుంబ కథతో ముడిపెట్టి రూపొందించిన ఈ చిత్రం కాస్త ఆల‌స్యం అయినా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అయింది.

కథ విష‌యానికి వ‌స్తే.. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాసవి తన ఇద్దరు కుమారులను పెంచుకుంటూ జీవితాన్ని సాగిస్తుంది. పిల్లలే తన లోకంగా భావించే ఆమె.. వాళ్లు పెరిగి పెద్దయిన కొన్నాళ్ల త‌ర్వాత‌ తన జీవితంలోనూ ఓ తోడు కావాలని కోరుకుంటుంది. అయితే వితంతువు మరో పెళ్లిని సమాజం అంత తేలికగా అంగీకరించని విష‌యం తెలిసిందే. మరోవైపు మొదట్లో తల్లి నిర్ణయాన్ని అర్థం చేసుకోలేని కుమారులు చివరకు తల్లికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఆమెకు సరైన జీవిత భాగస్వామిని వెతికే ప్రయత్నం మొదలుపెడతారు.

ఈ సమయంలోనే వాసవి జీవితంలోకి ఏడు కొండలు అనే వ్యక్తి వస్తాడు. అయితే ఈ పెళ్లికి కుటుంబం, సమాజం నుంచి ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. వాసవి తీసుకున్న నిర్ణయం చుట్టూ మొదలైన సంఘర్షణ చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేదే సినిమా. భర్తను కోల్పోయిన తర్వాత ఓ మహిళ తన జీవితంపై మరోసారి నిర్ణయం తీసుకుంటే సమాజం దాన్ని ఎలా చూస్తుంది? ఆమెకు కుటుంబం అండగా నిలుస్తుందా? అనే ప్రశ్నలను దర్శకుడు ఈ కథలో ప్రస్తావించారు.

ఏపీలో నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ మూవీ ఆద్యంతం ఫ్యామిలీ, ఎమోష‌న్స్ చుట్టే తిరుగుతుంది. వాసవి పాత్రలో స్వాసిక (Swaasika) జీవించేసింది. ఏడు కొండలుగా విజయ్ ఆంటోనీ.. కుమారుల పాత్రల్లో అజయ్ దుషాన్, శక్తి ఇద్దరు అద్భుతంగా న‌టించేశారు. అయితే.. విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌కు ‘బిచ్చగాడు’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వంద దేవుళ్ళు’పై సహజంగానే ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఈ చిత్రం జీ5 (ZEE 5) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి సోల్‌ఫుల్ ఫ్యామిలీ డ్రామా చూడాల‌నుకునే వారు ఈ సినిమాను వీక్షించ‌వ‌చ్చు.

Updated Date - Aug 07 , 2026 | 02:57 PM