Veerabhadrudu OTT: వీరభద్రుడు.. ఓటీటీకి వచ్చేస్తున్నాడు
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:53 PM
కంగువా, రెట్రో వంటి వరుస భారీ డిజాస్టర్ల తర్వాత సూర్య నటించిన చిత్రం కరుప్పు (వీరభద్రుడు) డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
కంగువా, రెట్రో వంటి వరుస భారీ డిజాస్టర్ల తర్వాత సూర్య (Suriya) నటించిన చిత్రం కరుప్పు (Karuppu). తెలుగులో వీరభద్రుడు (Veerabhadrudu)గా మే నెల 15న థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) ఈ మూవీకి దర్శకత్వం వహించగా త్రిష కథానాయికగా చేసింది. మన దేశంలోని న్యాయ వ్యవస్థలో తరాలుగా పాతుకుపోయిన లోపాలను ఎత్తి చూపుతూ దానికి దైవాంశను ముడిపెడుతూ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా రూపొందించారు. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. బేబీ కృష్ణ లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూ జడ్జితో సహా లాయర్స్, అక్కడి అధికారులను మొత్తాన్ని తన అధీనంలోనే ఉంచుకుని ఓ సామ్రాజ్యాన్నే నడిపిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో కుమార్తె మీను వైద్యం కోసం తమిళనాడు నుంచి వచ్చిన మునిస్వామి నాయుడు బంగారం దొంగతనానికి గురవుతుంది. దీంతో అతను పోలీసులను అశ్రయించగా పోలీసులు బంగారాన్ని రికవరీ చేస్తారు కానీ దానిని కోర్టు ద్వారానే తీసుకోవాలని చెబుతారు. దీంతో మునిస్వామి కోర్టుకు వెళ్లగా అక్కడ బేబీ కృష్ణ ఆ కేసు ఎంతకీ ముందుకు పడనీయడు.
తన కూతురు ఆపరేషన్ టైం దగ్గర పడుతుండడంతో ఎలాగైనా అ బంగారం త్వరగా విడిపించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఏ లాయర్‌ను కలిసినా పని కాదు. దీంతో కోర్టు సమీపంలో ఉన్న వీరభద్రుడి ప్రతిమకు వేడుకుని అక్కడ ఉన్న మిరపకాయలు దంచితే కోరుకున్నది నెరవేరుతుందని ఎవరో చెబితే విని ముని స్వామి ఆ పని చేస్తాడు. దాంతో వీరభద్రుడు లాయర్ రూపంలో వచ్చి ఈ కేసును వాదించేందుకు రెడీ అవుతాడు. ఈ క్రమంలోపబ్‌లో జరిగిన ఓ ఘటనలో లాయర్‌గా వచ్చింది వీరభద్రుడు అని తెలుసుకున్న బేబీ కృష్ణ దేవుడిగా శక్తులు ఉపయోగించకుండా కేసు గెలిచి చూపించాలని వీరభద్రుడికి సవాల్ విసురుతాడు.
ఈ నేపథ్యంలో వీరభద్రుడు ఆ కేసు గెలిచాడా లేదా, ఆపై కోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. అయితే సినిమా స్టార్ట్ అయింది మొదలు ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగా సాగిన చిత్రం ఆపై అంతా రెగ్యులర్ ఫార్మాట్‌లకి మారి మూవీపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇప్పుడు ఈ చిత్రం మరో మూడు రోజుల్లో జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo )లో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో మిస్సయిన వారు, సూర్య ఫ్యాన్స్ ఎంచక్కా ఇంటివద్దే ఉండి వీక్షించవచ్చు.