Modha Rathri Analysis: అంతర్గత విషాదం.. ఆహ్లాదంగా

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:37 PM

ఒక గ్రామీణ వివాహ నేపథ్యంతో, ఒక రాత్రి జరిగిన సంఘటనలతో, హాస్య ప్రధానంగా చూపే తమిళ చిత్రం మొద రాత్రి.

Modha Rathri

పెళ్లి అనేది భారతీయ సమాజంలో ఒక ఒప్పందంతో రెండు కుటుంబాల మధ్య జరిగే తంతు. అందులో పెళ్లికొడుకు, పెళ్లికూతురు తమ జీవితాలకు తామే నిర్దేశకులు కారు. వాళ్ల చుట్టూ చాలా మంది, చాలా అభిప్రాయాలు, సంప్రదా యాలు, పరువు ప్రతిష్ఠలుంటాయి. వాళ్లిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకునే తీరిక ఎవరికీ ఉండదు. ఈ వైరుధ్యాన్ని ఒక గ్రామీణ వివాహ నేపథ్యంతో, ఒక రాత్రి జరిగిన సంఘటనలతో, హాస్య ప్రధానంగా చూపే తమిళ చిత్రం మొద రాత్రి (Modha Rathri). అంటే మొదటి రాత్రి అని.

సినిమా పేరు 'మొద రాత్రి'. కానీ ఈ కథలో మొదటి రాత్రి అనేది శారీరక కలయికకు సంబంధించిన సందర్భం కాదు. ఇద్దరు అపరిచితులు మొదటిసారి ఒకరినొకరు మనుషులుగా అర్థం చేసుకోవడం ప్రారంభించిన రాత్రి. సుదీర్ఘ సింగిల్ టేక్, సమూహ పాత్రల బ్లాకింగ్, జ్ఞాపకాల విభిన్న చిత్రీకరణ, రాత్రి ఛాయాగ్రహణం, ప్రాంతీయ వాద్యాలతో శబ్ద రూపకల్పన, హాస్యం విషాదం జమిలి ప్రయాణం వంటి అంశాల్లో.. మొదటి సినిమాయే అయినప్పటికీ దర్శకుడు రాజా కురుప్పుస్వామి (Raja Karuppasamy) తపన ఈ సినిమాను మంచి సినిమాగా మార్చింది. తెలుగు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) ఈ చిన్న బ‌డ్జెట్‌ చిత్రంతో త‌మిళ‌నాట అడుగు పెట్ట‌డం విశేషం.

మారుదు, ముత్తు సెల్విలకు పెళ్లవుతుంది. మారుదు పరిస్థితుల కారణంగా పెళ్లికి అంగీకరిస్తాడు. ముత్తు సెల్వి అప్పటికే తన ప్రియుడితో వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకుంటుంది. కానీ కుదరదు. కొత్త దంపతుల మొదటి రాత్రి సాధారణంగా సినిమాల్లో శృంగారానికి ప్రారంభం కావాల్సిన సన్నివేశం. కానీ ఒక నైతిక సంకటం ప్రారంభానికి వేదిక అవుతుంది. తన భార్య మరొకరిని ప్రేమిస్తోందని మారుదుకు తెలుస్తుంది. అప్పటివరకు ఒక సంప్రదాయంలో భాగస్వామిగా ఉన్న అతడు అకస్మాత్తుగా ఒక మనిషిగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. భార్యను తన ఆస్తిగా భావించాలా? తనను ప్రేమించని వ్యక్తితో జీవితాన్ని కొనసాగిం చాలా? లేక ఆమె కోరుకున్న జీవితాన్ని ఆమెకు అందించడానికి ప్రయత్నించాలా? అనే సంకటంలో నలిగి మారుదు.. ఆమెను ప్రేమించిన వ్యక్తి దగ్గరకే తీసుకెళ్లాలనే నిర్ణయానికి వస్తాడు.

'మొద రాత్రి' కేవలం ఒక పెళ్లి రాత్రి కథ కాదు. వివాహం అనే వ్యవస్థలో మనుషుల వ్యక్తిగత ఆకాంక్షలకు ఎంత స్థానం ఉందనే ప్రశ్న కూడా. పెళ్లింట్లో వెలుగు ఎక్కువ. మనుషులు ఎక్కువ. శబ్దం ఎక్కువ. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువ. బయట రాత్రి చీకటిగా ఉంటుంది. మనుషులు తక్కువగా ఉంటారు. కానీ భార్యాభర్తలు ఒకరితో మరొకరు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం అక్కడే కలుగుతుంది. ఈ వైరుధ్యం ఒక దృశ్యాత్మక ప్రతీక.

Modha Rathri

గందరగోళాన్ని ఒక నిర్మాణంగా మార్చడం ఈ సినిమా రూప విన్యాసం. ఒకవైపు భార్యాభర్తల వ్యక్తిగత సంక్షోభం. మరోవైపు కుటుంబాల సామూహిక గందరగోళం. ఈ రెండింటినీ సమాంతరంగా నడిపిస్తూ దర్శకుడు హాస్యాన్ని సృష్టించాడు. కథ ఒకే కేంద్రం నుంచి సరళరేఖలా ముందుకు వెళ్లదు. అనేక చిన్నచిన్న సంఘటనలు, ఉపకథలు, పాత్రల వ్యక్తిగత చరిత్రలు ప్రధాన కథను చుట్టుముడతాయి. పెళ్లింట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు. మరో మూలలో ఇంకో వివాదం మొదలవుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుందనుకునేలోగా మరో సమస్య పుటుకొస్తుంది.

ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది. ప్రారంభంలోని కట్ లేకుండా సాగే సుదీర్ఘ సింగిల్ టేక్ సన్నివేశం. సాధారణంగా ఒక కుటుంబాన్ని పరిచయం చేయాలంటే.. ఏ దర్శకుడైనా కొన్ని షాట్లు తీస్తాడు. అయా పాత్రల ముఖాలను విడి విడిగా చూపిస్తాడు. వాటిని ఎడిటింగ్ ద్వారా కలుపుతాడు. కానీ ఇక్కడ కెమెరా ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి ప్రయాణిస్తూ, పాత్రలను, వాళ్ల మధ్య సంబంధాలను, పరిసరాలను ఒక నిరంతర దృశ్య ప్రవాహంలా పరిచయం చేస్తుంది. ఈ వన్ షాట్ స్టేజింగ్ ఎక్కడా డిజిటల్ స్టిచింగ్ లేకపోవడం దర్శకుడి ప్రతిభ చాలా సందర్భాలలో ఈ సినిమాలో కెమెరాయే కథకుడు. ఇక ప్ర‌ధాన పాత్ర‌ల‌కు రిషి కాంత్ (Rishikant), అనిష్మ (Anishma Anilkumar) లు ప్రాణం పోశారు. ఇక ముత్తు సెల్వి ప్రేమికుడి పాత్ర‌లో ద‌ర్శ‌కుడు రాజా కురుప్పుస్వామి నేటి యువ‌త పోక‌డ‌ల‌ను గుర్తుకు చేస్తాడు.

'మొద రాత్రి' హాస్యం వెనుక ఉన్నది సామాజిక విషాదం. ఒక అంతర్గత విషాదం. ఒక యువతి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోవడం విషాదం. ఒక యువకుడు తన ఇష్టానికి భిన్నంగా వివాహ బంధంలో ఇరుక్కోవాల్సి రావడం విషాదం. కానీ ఈ రెండు విషాదాలు కలిసినప్పుడు పుట్టే హాస్యం నవ్విస్తూనే.. గుండెను కలుక్కుమనిపిస్తుంది. అంతేకాదు.. ముత్తు సెల్వి ప్రేమించిన వ్యక్తి కూడా ఆదర్శ ప్రేమికుడేం కాదు. ప్రేమ గురించి మాట్లాడతాడు. కానీ అవసరమైన బాధ్యతను స్వీకరించడానికి వెన్ను చూపుతాడు. ఇక్కడే ప్రేమ ఒక భావన మాత్రమేనా, లేక బాధ్యతతో కూడిన ఆచరణా? అనే ప్రశ్న పుడుతుంది.

ప్రేమించడమంటే ఒకరిని సొంతం చేసుకోవడం కాదు. ఒకరి గతాన్ని, గాయాలను, అసంపూర్ణతలను అర్థం చేసుకోవడం. వివాహ మంటే ఇద్దరు మనుషులను ఒకే గదిలోకి పంపించడం కాదు. వాళ్లు ఒకరి జీవితంలోకి మరొకరు స్వేచ్ఛగా ప్రవేశించగలిగే పరిస్థితిని కల్పించడం. పెళ్లి ఒక సంఘటన.. అనుబంధం ఒక పరిణామం. ఈ రెంటి మధ్య ఉన్న దూరాన్ని ఒకే రాత్రిలో కొలవడానికి ప్రయత్నించిన సినిమా 'మొద రాత్రి'. ఆ రాత్రి గడిచి పోతుంది. కానీ ఆ రాత్రి.. మనుషులు ఒకరినొకరు చూసుకునే కోణాన్ని మారుస్తుంది. బహుశా ఏ వివాహానికైనా నిజమైన మొదటి రాత్రి అదే. - ప్ర‌సేన్, 70133 58154

Updated Date - Oct 25 , 2026 | 02:48 PM