Chikatilo Movie Review: శోభిత దూళిపాల.. 'చీకటిలో' మూవీ రివ్యూ

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:11 PM

శోభిత దూళిపాల ప్రధాన పాత్ర పోషించిన 'చీకటిలో...' సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Chikatilo Movie

ఇప్పటికే పలు సినిమాలతో, వెబ్ సీరిస్ లతో తెలుగువారికి సుపరిచితురాలైంది శోభిత దూళిపాల. అక్కినేని నాగచైతన్యతో వివాహానంతరం ఆమె నటించే సినిమాలపై సహజంగానే జనాలలో ఆసక్తి నెలకొంది. తొలిసారి శోభిత తెలుగు ఓటీటీ మూవీ 'చీకటిలో...' నటించింది. శుక్రవారం నుండి అది ప్రైమ్ వీడియోస్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ముందు నాగచైతన్య నటించిన 'దూత' అనే వెబ్ సీరిస్ కూడా ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే... శోభిత నటించిన 'చీకటిలో...' ఓటీటీ మూవీని ఆమె భర్త, నాగచైతన్య మేనమామ డి. సురేశ్‌ బాబు నిర్మించడం విశేషం.


'ఇదీ ఘోరం' అనే క్రైమ్ షో ను ఓ ఛానెల్ లో నిర్వహించే సంధ్య (శోభిత దూళిపాల) ఉద్యోగానికి రిజైన్ చేసి సొంతంగా 'చీకటిలో' అనే పాడ్ కాస్ట్ ను మొదలు పెడుతుంది. అదే సమయంలో బోయ్ ఫ్రెండ్ అమర్ (విశ్వదేవ్ రాచకొండ)తో ఆమె ప్రేమ... పెళ్ళి దిశగా సాగుతుంది. సంధ్యను పాడ్ కాస్ట్ పెట్టమని సలహా ఇచ్చి, ప్రోత్సహించిన కొలిగ్ బాబీ (అదితి మ్యాకాల్), ఆమె ప్రియుడు ఊహించని విధంగా హత్యకు గురౌతారు. తన స్నేహితురాలి హత్యోదంతంతోనే సంధ్య పాడ్ కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఈ కేసును టేకప్ చేసిన సి. ఐ. రాజీవ్ (చైతన్య కృష్ణ) సహకారంతో ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. అయితే ఇదే తరహాలో మూడు దశాబ్దాల క్రితం గోదావరి జిల్లాలలోనూ కొన్ని హత్యలు జరిగాయనే విషయం సంధ్యకు తెలుస్తోంది. అమర్ తో కలిసి అక్కడకు వెళ్ళి బాధితులతో మాట్లాడిన తర్వాత ఇదో క్లాసిక్ సీరియల్ కిల్లర్ చేస్తున్న పని అని ఆమెకు అర్థమౌతుంది. అయితే సంధ్య ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తోందని, ఆమె పాడ్ కాస్ట్ తో తెలుసుకున్న కిల్లర్ 'తానెవరో కనిపెట్టమ'ని ఛాలెంజ్ విసురుతాడు. ఇంతలో కేసులో సరైన పురోగతి లేకపోవడంతో ఆనందిత (ఇషా చావ్లా)కు దానిని అప్పగిస్తారు. ఆమె టీమ్ తో కలిసి పని చేసే ఆస్కారం సంధ్యకు లభిస్తుంది. మరి సీరియల్ కిల్లర్ ను వాళ్ళు పట్టుకోగలిగారా? మూడు దశాబ్దాల తర్వాత మరోసారి ఆ కిల్లర్ ఎందుకు సైకోగా మారి హత్యలు చేయడం మొదలు పెట్టాడు? తమ మధ్యే ఉన్న ఆ కిల్లర్ ను వీళ్ళు ఎలా పసిగటగ్టారు? అనేదే మిగతా కథ.


దాదాపు రెండు గంటల నిడివి ఉన్న 'చీకటిలో...' సినిమా ఎలాంటి తాత్సారం లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోయింది. క్రిమినాలజీ చదివిన ఓ రిపోర్టర్ తనకు అందిన క్లూస్ తో ఎలా ఓ కేసును సాల్వ్ చేసిందన్నదే ఈ కథ. అయితే... ఇందులో ఇన్వెస్టిగేషన్ కంటే హత్యలు, వాటి పర్యవసానాలు, బాధితుల గోడు... వీటిపైనే దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి దృష్టి పెట్టాడు. హీరోయిన్ సంధ్య సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ సమాచార సేకరణ కోసం కృషి చేస్తూనే ఉంటుంది. చివరకు కిల్లర్ ను తెలుసుకుంటుంది. అయితే అతని మోటివ్ కి కారణం చెబుతూ దర్శకుడు రాసుకున్న పాయింట్ అంత బలంగా లేదు. అతన్నో సైకోగా చిత్రీకరించడం కోసం చేసిన ప్రయత్నం కూడా చాలా బలహీనంగా ఉంది. దాంతో పతాక సన్నివేశం తేలిపోయింది. కథలో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. దానికి తోడు కథనం కూడా రొటీన్ గా, స్లోగా ఉండటం కొంత నిరాశకు గురిచేస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే... శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. ఆమె బోయ్ ఫ్రెండ్ గా '35 చిన్న కథ కాదు' ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ నటించాడు. నిజానికి అతని పాత్ర కంటే సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్రే కాస్తంత బలమైంది. అతను బాగా చేశాడు. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. ఇతర ప్రధాన పాత్రలను ఆమని, సురేశ్‌, ప్రదీప్, ఝాన్సీ, శ్రీలక్ష్మి, రవీంద్ర విజయ్, అజీజ్ నాజర్ తదితరులు పోషించారు. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది. నిజానికి ఈ సినిమాలో ప్రతిభగల నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఉపయోగించుకోలేదు. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. 'తప్పు చేసి చీకట్లో దాక్కునే ఏ మృగాన్ని వదల కూడదు, మన భయం వాళ్ళకి బలంగా మారకూడదు' అనే పాయింట్ మీద తీసిన 'చీకటిలో...' మూవీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే భారీ అంచనాలు మాత్రం పెట్టుకోకూడదు.

రేటింగ్: 2.5/ 5

ట్యాగ్ లైన్: చీకటిలో... ఏం జరిగింది!?

Updated Date - Jan 23 , 2026 | 07:16 PM